వైఎస్సార్‌ ‘లా నేస్తం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

Ysr Law Nestham Scheme 2023 Funds Release Program Updates - Sakshi

సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా ‘లా నేస్తం’ నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు ‘లా నేస్తం’ అని సీఎం అన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్‌ న్యాయవాదుల కోసం రూ.­1,00,55,000లను రాష్ట్ర ప్రభు­త్వం విడుదల చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం.. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్‌ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయ­వాద వృత్తిలోకి వచ్చిన జూనియర్‌ న్యాయవాదులు వృత్తిలో ఎదు­రయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్‌ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించిన మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయ­వాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు.

ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.­100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడ్వొకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది.

కోవిడ్‌ సమ­యంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్‌ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్‌ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top