దేవుడే వారి రూపంలో వచ్చి..  నిండు ప్రాణం నిలబెట్టారు

YSR Kadapa Police Officers Save Man Who Hang To Commit Suicide - Sakshi

ఉరేసుకుంటున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

కడప : కొన్ని క్షణాలు ఆలస్యమైతే ఒక నిండు ప్రాణం పోయేది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. మెరుపులా వచ్చారు ఇద్దరు పోలీసులు.. ఇంటి తలుపులు పగలకొట్టి ఉరికి వేలాడుతున్న వ్యక్తిని కాపాడారు. నిజంగా దేవుడే పోలీసుల రూపంలో వచ్చాడేమో అనేలా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు రూరల్‌ పరిధిలోని చౌటపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న అతను ఉరేసుకునేందుకు ఫ్యాన్‌కు చీర చుడుతున్నాడు.

 కిటికిలో నుంచి కుమారుడ్ని గమనించిన తల్లి చెన్నమ్మ గట్టిగా కేకలు వేసింది. ఆత్మహత్య చేసుకోవద్దని, బయటికి రమ్మంటూ ఆమె రోదించసాగింది. ఈ క్రమంలోనే ఆమె కమాండ్‌ కంట్రోల్‌కు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. బ్లూకోల్ట్స్‌–7కు చెందిన పోలీసులు రామాంజనేయులు, నరసింహనాయుడు హుటా హుటిన చౌటపల్లెలోని ఎస్సీ కాలనీకి వెళ్లారు. స్థానికుల సాయంతో వెంటనే ఇంటి తలుపు పగులకొట్టారు. అప్పటికే ఉరికి వేలాడుతున్న సుబ్బరాయుడును పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడారు. 

తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.  సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ఇన్‌చార్జి డీఎస్పీ చెంచుబాబు, రూరల్‌ ఎస్‌ఐ శివశంకర్‌ అభినందించారు. సుబ్బరాయుడు తల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. క్షణాల్లో స్పందించి సుబ్బరాయుడిని కాపాడిన బ్లూకోల్ట్స్‌ పోలీసులు రామాంజనేయులు, నరసింహనాయుడును జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ అభినందించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top