ఎన్నికలు బహిష్కరణ | YSR Congress Party announces boycott of irrigation union elections | Sakshi
Sakshi News home page

ఎన్నికలు బహిష్కరణ

Dec 14 2024 5:23 AM | Updated on Dec 14 2024 5:23 AM

YSR Congress Party announces boycott of irrigation union elections

కూటమి ప్రభుత్వ అరాచకంతో వైఎస్సార్‌సీపీ నిర్ణయం.. 

ఎన్నికల్లో ఇతరులు పోటీ చేయకుండా అడ్డగింత

పలుచోట్ల దాడులకు తెగబడుతున్న కూటమి శ్రేణులు

అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా బెదిరింపులు 

కళ్లెదుటే దౌర్జన్యం చేస్తున్నా చోద్యం చూస్తున్న పోలీసులు

దౌర్జన్యాన్ని వెలుగులోకి తెస్తున్న మీడియాపై కూడా దాడులు

పార్టీ నేతల అభిప్రాయాలను అధినేత వైఎస్‌ జగన్‌కు నివేదించిన సజ్జల 

అందరి అభిప్రాయాల మేరకు ఈ ఎన్నికలకు దూరం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను అప్రజాస్వావిుకంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్‌ కో – ఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్‌ కో– ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగు నీటి సంఘాల ఎన్నికల్లో ప్రభుత్వ సూచనలతో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును సమీక్షించారు. 

టెలి కాన్ఫరెన్స్‌లో పలువురు నేతలు మాట్లాడుతూ.. ‘సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగాన్ని ప్రయోగించి, కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పోటీ ఉన్న చోట సీక్రెట్‌ బ్యాలెట్‌ ప్రకారం ఎన్నికలు జరపాలి. ఆ బాధ్యత ప్రభుత్వ యంత్రాగానిది. అయితే అందుకు పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. 

ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అభ్యర్థులకు నీటి పన్నుకు సంబంధించి నో డ్యూ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన వారు గెలిచే అవకాశం లేకపోయినా, దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలని రౌడీయిజానికి దిగుతున్నారు. 

వాటిని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపై కూడా దాడులకు తెగబడుతున్నారు. కూటమి ప్రభుత్వ దాష్టీకానికి నిరసగా ఈ ఎన్నికలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉండాలి’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని నేతల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు నివేదించారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్‌ జగన్‌.. కూటమి ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిరసనగా సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించాలని నిర్ణయించారని సజ్జల తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement