మా జీవితాలను మార్చేందుకు మీరు పడిన కష్టం, విజన్‌ను వృథా కానివ్వం
ప్రాణాలకు తెగించి చేపల వేట సాగిస్తున్నాం
మా బిడ్డల భవిష్యత్ కోసం ఆ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాం
మత్స్యకారుల బతుకులను చీకట్లోకి నెట్టే ఏ ఒక్కరినీ వదిలి పెట్టం
నేడు వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటనపైనే గంగపుత్రులు గంపెడు ఆశలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జువ్వలదిన్నె పర్యటన యావత్ ఆంధ్రప్రదేశ్ తీరంలోని మత్స్యకారుల జీవితాలకు భరోసాగా నిలువనుందా? అంటే అవునని గంగపుత్రులతోపాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. ఆయన చేసే దిశానిర్దేశంపైనే మత్స్యకారులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ తమ భావితరాల భవిష్యత్ కోసం అందుబాటులోకి తెచ్చిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం, తాము ప్రాణాలకు తెగించి పట్టుకున్న పుదుచ్చేరి బోట్లను వదిలేసేందుకు మంత్రి లోకేశ్ పోలీసులకు ఆదేశాలివ్వడం, టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు వదిలేయించడంతో ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో అర్థమవుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. తమ జీవితాలను మార్చేందుకు వైఎస్ జగన్ పడిన కష్టాన్ని, విజన్‌ను వృథా కానివ్వమని, మా భవిష్యత్, మా నమ్మకం జగనేనంటున్నారు. మత్స్యకారుల బతుకులతో ఆడుకుంటూ, భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేసే ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.
నెల్లూరురూరల్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నెలో బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 9గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని జువ్వలదిన్నెకు బయలుదేరుతారు. 10 గంటలకు జువ్వలదిన్నె హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఫిషింగ్‌హార్బర్ వద్దకు చేరుకుని 10.25 గంటల వరకు సందర్శిస్తారు. ఆ తరువాత 11.05 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని బెంగళూరుకు తరలి వెళుతారు.
చంద్రబాబు/లోకేశ్ చేసిన ద్రోహం
æగత ప్రభుత్వం ప్రారంభించి, పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సీఎం చంద్రబాబు, లోకేశ్, నేతలు ఈ క్రెడిట్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని, మత్స్యకారుల్లో ఆయనకు బలం పెరుగుతుందని భావించి కుట్రలకు తెగించారు. ఫిషింగ్ హార్బర్‌కు కేటాయించిన 78.6 ఎకరాల్లో ముఖ ద్వార ప్రాంతంలోనే తొలి దశలోనే 29.5 ఎకరాలు గుట్టు చప్పుడు కాకుండా సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టేసి ఒక్క రోజు ముందు వచ్చి శంకుస్థాపన చేసి మత్స్యకారుల భావితరాలకు సైతం ద్రోహం చేశారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ జాలర్లతో పడుతున్న కష్టనష్టాల నేపథ్యంలో ఐదు నెలల క్రితం ప్రాణాలకు తెగించి కావలి మండలం పెద్దపట్టపుపాళెం, బోగోలు మండలం జువ్వలదిన్నె ప్రాంతాల్లో నాలుగు పాండిచ్చేరి బోట్లను పట్టుకున్నారు. అప్పట్లో మత్స్య శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. తమిళ బోట్ల యజమానులతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల నేపథ్యంలో మార్చి 12న జువ్వలదిన్నెకు వచ్చిన లోకేశ్ నాలుగు పాండిచ్చేరి బోట్లు వదిలేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. మత్స్యకారులతో పెట్టుకుంటే ఇబ్బందని పోలీసులు చెప్పినా రెడ్‌బుక్ రాజ్యాంగం మత్తులో ఉన్న లోకేశ్ అదంతా నేను చూసుకుంటానని చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రను మార్చి 17న నెల్లూరుకు పంపించి, మత్స్యకారులకు మేలు చేస్తున్నామంటూ మీటింగ్ పెట్టించారు. స్థానికుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు సహకారంతో అదే రోజు రాత్రి నాలుగు పాండిచ్చేరి బోట్లను వదిలేయించి ఏకంగా ఆత్మస్థైర్యంపైనే దెబ్బ కొట్టారు.
ఫలితం ఏమిటంటే..
ఐదు నెలలుగా స్థానిక మత్స్యకారుల నిర్బంధంలో పాండిచ్చేరి బోట్లు ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటు వైపు కన్నెత్తి చూడడానికి భయపడిన తమిళ జాలర్లు.. బోట్లు విడుదల చేసిన మరుసటి రోజు నుంచే విచ్చలవిడిగా తీరం వైపు దూసుకొచ్చి ఆంధ్రా మత్స్యకారులకు సవాల్ విసిరారు.
వైఎస్ జగన్ చేసిన మేలు
తరతరాలుగా సంప్రదాయ వృత్తి వేటను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, భావితరాల భవిష్యత్‌ను ఉజ్వలం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక అభివృద్ధి చేపట్టారు.బతుకు దెరువుకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, గుజరాత్ వంటి పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే మత్స్యకారులు, యువతకు స్థానికంగానే వేట, ఉపాధి కలి్పంచేందుకు జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్‌కు శ్రీకారం చుట్టారు. దానికి అనుబంధంగా మత్స్యకార మహిళలకు మత్స్య సంపద ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్ కోర్టుల ద్వారా ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిషింగ్ హార్బర్‌లో కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్ షాపులు, గేర్ షెడ్‌లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు కలి్పంచారు.

చంద్రబాబు ప్రభుత్వంలో అన్యాయం
చంద్రబాబు ప్రభుత్వంలో మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రభుత్వం చేయాల్సిన పని మేం చేసి తమిళ రాష్ట్రాల సోనాబోట్లను పట్టుకుంటే వాటిని ప్రభుత్వ పెద్దలు గుట్టు చప్పుడు కాకుండా విడిచి పెట్టి ఏం తెలియనట్లు నాటకాలాడుతున్నారు. అదేమంటే మంత్రుల కమిటీ వేశామని బుకాయిస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి జువ్వలదిన్నె పర్యటనతో మత్స్యకారులకు పూర్తి భరోసా ఉంటుంది. మత్స్యకారులకు జగనన్నే అండ.
– కొండూరి అంకయ్య, ఎంపీటీసీ, పాకల
ఆర్థికంగా నష్టపోయాం
సోనాబోట్ల కారణంగా ఆర్థికంగా నష్టపోయాం. సోనాబోట్లను అడ్డుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. చివరికి మేం సమష్టిగా వెళ్లి 4 సోనాబోట్లను తెచ్చి జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచితే వాటిని ప్రభుత్వ పెద్దలు కుటిల రాజకీయంతో విడిపించి మాకు తీరని ద్రోహం చేశారు. మత్స్యకారులకు మొదటి నుంచి జగనన్న అండగా ఉన్నారు. జగనన్న పర్యటనతో మత్స్యకారులకు మేలు జరుగుతుంది.
– కాటంగారి చిట్టిబాబు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, పోతయ్యగారిపట్టపుపాళెం, పాకల
మా గోడు ఆలకించరు
ఇతర రాష్ట్రాల సోనాబోట్ల వల్ల తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా మా గోడు పట్టించుకోలేదు. మేం చందాలు వేసుకుని నిధులు సమకూర్చుకుని సోనాబోట్లపై ప్రాణాలకు తెగించి దాడి చేసి వాటిని పట్టుకుంటే ప్రభుత్వ పెద్దలు ఏం ఎరగనట్లు కుట్రలు పన్ని వాటిని విడిపించి మాకు తీరని ద్రోహం చేశారు. ప్రభుత్వ పెద్దలు మాకు మభ్య పెట్టే మాటలు చెబుతున్నారు. జగనన్న పర్యటనతో మత్స్యకారులకు పూర్తి భరోసా లభిస్తుంది.
– వాయిల రామ్మూర్తి, మాజీ కాపు, పోతయ్యగారిపట్టపుపాళెం, పాకల
టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు
టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ మా భవిష్యత్ గురించి ఆలోచన చేయలేదు. వైఎస్ జగన్ ఐదేళ్లు అధికారంలో ఉంటే.. అందరితోపాటు సమానంగా సంక్షేమ పథకాలు, మా మహిళలకు పొదుపు రుణాల మాఫీ, మా బిడ్డలకు అమ్మఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్, మాకు వేట నిషేధ సమయంలో ఏటా రూ.10 వేలు లెక్కన ఠంచన్‌గా అందించారు. చంద్రబాబు రూ.20 వేలిస్తామని చెప్పినా.. సగం మందికి కూడా రావడం లేదు. ఈ సమస్యలన్నీ జగన్‌కు వివరించి పరిష్కారం కోరాలని మత్స్యకారులందరూ ఎదురు చూస్తున్నారు.
– వాయిల శ్యామ్, మార్కండేయపురం, తుమ్మలపెంట పంచాయతీ


