వాటికి తొలి ప్రాధాన్యత: సీఎం జగన్‌ | YS Jagan Review On Construction Of Industrial Corridors And Ports | Sakshi
Sakshi News home page

పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత

Nov 26 2020 4:09 PM | Updated on Nov 27 2020 1:21 AM

సాక్షి, అమరావతి: పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో​ రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల్‌ వలవెన్, పరిశ్రమల డైరెక్టర్‌ జెవిఎన్‌ సుబ్రమణ్యం, ఏపీఐఐసీ వీసీ ఎండీ కె.ప్రవీణ్‌‌కుమార్‌రెడ్డి, ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈఓ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ ఈడీ పి.ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్‌ సమీక్ష)

సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ‘‘భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఆ విమానాశ్రయం నుంచి విశాఖ సిటీకి సత్వరమే చేరుకునేలా వేగంగా బీచ్‌ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి కావాలి. పోలవరం నుంచి విశాఖకు పైపు లైను ద్వారా తాగు నీటి సరఫరా ప్రాధాన్యతా అంశాలు. పోలవరం నుంచి విశాఖకు పైపు లైన్‌ ద్వారా తాగునీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీఆపీఆర్‌) వెంటనే సిద్ధం చేయాలి. పైమూడు పనులకు సంక్రాంతిలో శంకుస్థానకు అధికారులు సన్నద్ధం కావాలని’’ సీఎం ఆదేశించారు. (చదవండి: ఒకసారి నువ్వు.. ఒకసారి నేను)

మూడు పోర్టులు–పనులు:
కాగా, రామాయపట్నం పోర్టుకు డిసెంబర్‌ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. రామాయపట్నం పోర్టు పనులు వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరిలో మొదలుపెడతామని తెలిపారు. మొదటి దశలో 4 బెర్తులతో ఏడాదికి 15 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని అధికారులు వెల్లడించారు. భావనపాడు పోర్టుకు డిసెంబర్‌ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామని తెలిపారు. మార్చి 2021 నుంచి పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మొదటి దశలో 4 బెర్తులతో 25 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టుకు వచ్చే ఏడాది (2021)   ఫిబ్రవరి 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, ఏప్రిల్, 2021 నుంచి పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మొదటి దశలో 6 బెర్తులతో 26 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని అధికారులు తెలిపారు.

రెండున్నర ఏళ్లలో..:
ఈ మూడు పోర్టుల పనులన్నీ రెండున్నర ఏళ్లలో పూర్తి చేసేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మరోవైపు విశాపట్నం–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌లోని విశాఖపట్నం నోడ్‌లో అచ్యుతాపురం క్లస్టర్, నక్కపలి క్లస్టర్లో పనుల తీరును వివరించిన ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాంబిల్లి ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తద్వారా విశాఖపట్నం పోర్టుపై ఒత్తిడి తగ్గించ వచ్చని, ఇంకా కాలుష్యాన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయని సీఎం తెలిపారు.

శ్రీకాళహస్తి, ఏర్పేడు నోడ్‌లో కార్యకలాపాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఎయిర్‌ కార్గో అవసరాన్ని కూడా వివరించారు. తిరుపతి, నెల్లూరు, కడప విమానాశ్రయాల్లో ఎయిర్‌ కార్గో సదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఓర్వకల్‌ నోడ్‌లో కార్యకలాపాలను అధికారులు వివరించారు. పరిశ్రమలకు వీలైనంత వరకూ డీశాలినేషన్‌ వాటర్‌ను వినియోగించేలా చూడాలని సీఎం సూచించారు.
లీటరు నీరు 4 పైసలకు మాత్రమే వస్తుందని, దీని వల్ల తాగునీటిని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పారిశ్రామిక వాడల్లో మురుగునీటి పారిశుద్ధ కేంద్రాల (ఎస్పీటీ) ఏర్పాటు తప్పనిసరని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement