మాటిచ్చారు..నిలబెట్టుకున్నారు 

YS Jagan Mohan Reddy Help To Two Children Operation - Sakshi

‘మీ బిడ్డలకు నేను ఉన్నాను అక్కా..’ ఓ సామాన్య పేదరాలితో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న మాట ఇది. ఆ ఒక్క మాట ఇద్దరు బిడ్డల ప్రాణాలకు సంజీవనిగా మారింది. ఏళ్లకు ఏళ్లు ఏడుస్తూ బతుకుతున్న ఆ కుటుంబంలో ఆశల దీపాన్ని వెలిగించింది. చిన్నారుల చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేస్తూ అవస్థలు పడుతున్న వారికి ఓ దారిని చూపించింది. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ మందులతో ఆకలి తీర్చుకుంటున్న పసివాళ్లకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చింది. సికిల్‌ సెల్‌ ఎనీమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న జి.సిగడాంకు చెందిన ఇద్దరు చిన్నారుల ఆపరేషన్‌ కోసం వైఎస్‌ జగన్‌ సర్కారు రూ.32 లక్షల నగదు విడుదల చేసింది. 

శ్రీకాకుళం: మండల పరిధిలోని డీఆర్‌ వలస గ్రామానికి చెందిన పాండ్రంగి సుబ్బలక్ష్మి, రామారావు దంపతుల కుమారులు తిరుపతిరావు(12), యశ్వంత్‌ (10)లు సికిల్‌ సెల్‌ ఎనీమియా అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. ఈ బిడ్డల దీనస్థితిపై ‘సాక్షి’లో గత ఏడాది జూన్‌ 29 కథనం కూడా ప్రచురితమైంది. ఇన్నాళ్లకు ఆ ఇద్దరు చిన్నారుల జబ్బు శాశ్వతంగా నయమయ్యే మార్గం కనిపించింది. గత ఏడాది ఆగస్టు 26న విశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాగా.. ఆయన వద్దకు వెళ్లిన సుబ్బలక్ష్మి, రామారావు దంపతులు బిడ్డల పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. చిన్నారులకు సాయం చేస్తానని ఆనాడే సీఎం మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆస్పత్రిలో శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

రక్తహీనతతో ఇబ్బంది.. 
తిరుపతిరావు, యశ్వంత్‌లు ఐదేళ్లుగా ఈ రక్తహీనత వ్యాధితో బాధ పడుతున్నారు. బోన్‌ మ్యారో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌తో ఈ వ్యాధి నయమయ్యే అవకాశం ఉందని తెలియడంతో.. బోన్‌మ్యారో ఇవ్వడానికి కూడా తల్లిదండ్రులు ముందుకువచ్చారు. కానీ ఆ ఆపరేషన్‌కు చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు.  ఇలాంటి పరిస్థితుల్లో విశా ఖ వెళ్లి సీఎం జగన్‌కు తమ పరిస్థితి చెప్పారు. ‘మీ బిడ్డలకు నేను ఉన్నాను అక్కా..’ అంటూ ఆప్యాయంగా మాట్లాడిన సీఎం.. ఒక్కో చిన్నారికి చికిత్సకు రూ.16 లక్షల చొప్పున రూ.32 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని అమెరికన్‌ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ముందుగా పెద్ద కుమారుడికి ఆపరేషన్‌ చేసి ఆ తర్వాత చిన్నోడికి కూడా శస్త్ర చికిత్స చేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top