పరిపాలన అంటే ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేయడమా?
తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులపై మీకెందుకంత కక్ష?
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి చేసిన తప్పేంటి?
అతనిపై అక్రమ కేసు ఏంటి? ఇంట్లో సోదాలేంటి? అతనేమైనా ఉగ్రవాదా? టెర్రరిస్టా?
మరి మీరు పెడుతున్న పోస్టులకు రోజూ ఎంత మందిని అరెస్టు చేయాలి?
తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్‌ను తప్పుడు కేసులతో వేధించడం జంగిల్ రాజ్ కాదా?
టీడీపీ నాయకులు, కార్యకర్తల అరాచకాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
వ్యవస్థలను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం సుపరిపాలనా?
మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా?..
ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
సాక్షి, అమరావతి: ‘మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా..? మీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా..? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష?’ అని సీఎం చంద్రబాబునాయుడును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి.. అతనిపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి.. మరి మీరు పెడుతున్న పోస్టులకు ఎంత మందిని అరెస్టు చేయాలి? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్‌పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం జంగిల్ రాజ్ కాదా అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత రెండేళ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకోని మీరు.. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై అక్రమ కేసులు పెట్టడటం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు.
ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ నిలదీశారు. ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పేరోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలా?
గడిచిన రెండేళ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకోని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సబబు? మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నా వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వ్యవస్థలను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం సుపరిపాలనా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతి భద్రతలను దెబ్బతీసి అక్రమ కేసులు, అరెస్టులకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండీ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు.
వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు?
‘చంద్రబాబు గారూ.. మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా? ఆ గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడమా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయనిది చెప్పారా? మీరు చెప్పనిది చూపించారా? వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి? అతనిపై అక్రమ కేసు పెట్టడం ఏంటి? అతని ఇంట్లో సోదాలు చేయడం ఏంటి? అతనేమైనా ఉగ్రవాదా? టెర్రరిస్టా? మరి మీరు పెడుతున్న పోస్టులకు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్‌పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం జంగిల్ రాజ్ కాదా? ఆయన ఇంట్లో లేని సమయంలో ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇంట్లో తిష్ట వేయడం ఏంటి? ఇది రెడ్‌బుక్ పాలనకు నిదర్శనం కాదా?


