సాక్షి,తాడేపల్లి : చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు.. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తాం’అని హెచ్చరించారు
ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో.. ‘మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉండే APSADAకు తెలియకుండా..దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి?.
ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులవేనన్నవి అక్షర సత్యం కాదా?. కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీ పడ్డారన్నది నిజం కాదా?. అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు.చంద్రబాబూ.. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులు కూడా చితికిపోయారు
సిండికేట్ అవుతున్న కంపెనీల నుంచి..దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకు వచ్చి.. ఏకంగా ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా APSADA అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేస్తే మీరు వచ్చాక ఉద్దేశ పూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్, ఫీడ్ క్వాలిటీ ప్రమాణాలు సహా.. వాటి రేట్ల నియంత్రణ దగ్గరనుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా..యూనిట్ కరెంటును కేవలం రూ.1.5౦కే వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే..మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేశారు.
మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప..వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడు రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా?. చంద్రబాబూ.. ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు.. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తాం’అని వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేశారు.
.@ncbn గారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2026


