World Photography Day: గోడకు వేలాడే టెన్త్‌ క్లాస్‌ గ్రూప్‌ ఫొటో ఎన్నో జ్ఞాపకాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఇంకా!

World Photography Day 2022 Latest And Old Model Cameras Srikakulam District - Sakshi

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.

పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కుమార్తె ఫొటో తండ్రికి జీవిత కాలపు తోడుయవ్వనంలో ఉన్నప్పుడు నాన్న తీయించుకున్న ఛాయా చిత్రం అమ్మ దాచుకున్న రహస్యం. బీరువాలో దొరికే నానమ్మ ఫొటో బాల్యానికి దగ్గరి దారి. గోడ మధ్యన వేలాడుతూ కనిపించే టెన్త్‌ క్లాస్‌ గ్రూప్‌ ఫొటో ఎన్నో జ్ఞాపకాలకు కేరాఫ్‌ అడ్రస్‌. పెళ్లి ఆల్బమ్‌లు, విహారాల ఫొటోలు చిటికెలో బాధను మాయం చేయగల మందులు. ఫొటో అంటే కేవలం కాగితం కాదు .. అందరి గతం. కాలాన్ని బంధించే శక్తి దీనికి మాత్రమే ఉంది.       
జ్ఞాపకాల ఖజానా
టెక్కలి: ఫొటో తీయడం.. బాగులేకపోతే డిలీట్‌ చేయడం. ఫొటోగ్రఫీ గతం కంటే ఈజీ అయిపోయింది. డిజిటల్‌ వచ్చినప్పటి నుంచి ఫొటోలు తీయడంలో ఉన్న కిక్కు పోయింది. కెమెరా కడుపులో రీళ్లు ఉన్నప్పుడు అపురూప క్షణం కోసం గంటల కొద్దీ వేచి ఉండడం, సరైన చిత్రాన్ని తీయడానికి ఏకాగ్రతతో ఎదురు చూడడం, తదేక దీక్షతో క్లిక్‌ మనిపించడం చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. 

మెమొరీ కార్డులు వ చ్చి రీళ్లకు సమాధి కట్టేశాయి. పాత తరం కెమెరాను చూస్తే చాలాకాలానికి చూసిన బంధువులా అనిపిస్తుంది. బాల్య జ్ఞాపకమేదో కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటి జ్ఞాపకాల పెట్టెలను టెక్కలికి చెందిన హనుమంతు మల్లేశ్వరరావు సేకరిస్తున్నారు. వృత్తిరీత్యా వీడియో ఎడిటర్‌ అ యిన మల్లేశ్వరరావు పాతతరం కెమెరాలు సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. తెలిసిన వ్యక్తుల వద్ద ఉన్న పా తతరం కెమెరాలను సేకరించడం మొదలు పెట్టారు. 


50 ఏళ్ల నాటి కెమెరాను పరిశీలిస్తున్న మల్లేశ్వరరావు

గత కొన్ని రోజులుగా పాతతరం కెమెరాల సేకరణ వేటలో నిమగ్నమయ్యారు. యాభై ఏళ్ల కిందటి కెమెరాలను కూడా సేకరించారు. సాగరసంగమం సినిమాలోని ఓ సన్నివేశంలో కమల్‌హాసన్‌కు ఓ బాలుడు ఫొటోలు తీసే కెమెరా అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కెమెరాను కూడా సంపాదించారు. రీల్‌ కెమెరా నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాక్షన్‌ డిజిటల్‌ కెమెరాల వరకు వివిధ రకాల వీడియో, ఫొటో కెమెరాలను సేకరించి భద్రపరిచారు. 


మల్లేశ్వరరావు

వీడియో కెమెరాల్లో ఎన్‌ఈజీఎస్, త్రీసీసీడీ, 3500 తో పాటు మరి కొన్ని పాతతరం వీడియో కెమెరాలు మల్లేశ్వరరావు వద్ద ఉన్నాయి. వీటితో పాటు వివిధ రకాల రీల్‌ కెమెరాలతో పాటు సరికొత్త  7డీ, 70డీ, ఫోర్‌కె, గోప్రో, గింబల్, స్లైడర్‌ తదితర కెమెరాలను సేకరించారు.  

విహంగాలతో దోస్తీ 
జి.సిగడాం: వృత్తి రీత్యా ఆయన ఇంజినీర్‌. ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం. తలమునకలయ్యే పని. కానీ ఆయన ఒక రోజు పని చేస్తున్న సమయంలో ఓ పక్షి ప్రాణాల కోసం కొట్టుకుంటూ నేల మీద పడింది. ఆయన దాన్ని రక్షించి పంజరంలో పెట్టి కాపాడారు. ఆ క్షణం నుంచి ఆ ఇంజినీర్‌ జీవితం మరో మేలి మలుపు తిరిగింది. పక్షులపై ప్రేమ పెరిగింది. కెమెరా కంటితో పక్షుల కదలికలు చూడడం అలవాటైంది. సాధారణంగా పక్షులను చూసి ఆస్వాదించే కంటే ఫొటోలు తీసి ఆ క్షణాలను నిక్షిప్తం చేయడంలో మజా తెలిసింది. ఇంకే ముంది అప్పటి నుంచి పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 105 రకాల పక్షుల ఫొటోలు తీసి భద్రపరిచారు. 


కిశోర్‌ తీసిన పక్షుల చిత్రాలు

జి.సిగడాం మండలం పెంట గ్రామానికి చెందిన పెరుంబుదూరి నర్సిహంమూర్తి పెద్ద కుమారుడు పెరుంబుదూరి కిశోర్‌ పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇటీవలే సొంత ఊరికి వచ్చి కిశోర్‌ ప్రతి రోజు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి పక్షుల ఫొటోలు సేకరిస్తున్నారు. అవి ఎలా గుడ్లు పెడుతున్నాయి, బుల్లి పిట్టలు ఎలా జన్మిస్తున్నాయి, వాటి ఆహారం ఎలా పంచుకుంటున్నాయి అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల తామర ఆకులపై నెమలి తోక జకనా అనే పక్షి రాకపోకలు, విన్యాసాలను ఫొటోలు తీసి నిక్షిప్తం చేశారు. గుడ్లు పెట్టిన దశ నుంచి పొదిగే దశ వరకు అన్నింటినీ సేకరించారు. ఈ ఫొటోల కోసం సెలవుల్లో అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top