ఆలయాల్లో అక్రమాల కట్టడికి విజిలెన్స్ సెల్

ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి
సాక్షి, అమరావతి: ఆలయాల్లో అవినీతి, అక్రమాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఐజీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి(దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన 584 ఆలయ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని.. వాటిని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తామని చెప్పారు.
దాదాపు రూ.58.80 కోట్లతో మరో 142 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందగా, అందులో 43 ప్రతిపాదనలకు సంబంధించి స్థానికులు మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో కొంత మొత్తం చెల్లించారన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి మరో 99 ప్రతిపాదనలు రాగా, వాటిపై త్వరలో కమిటీ మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. ధూపదీప, నైవేద్య పథకాన్ని మరిన్ని ఆలయాల్లో అమలు చేయాలని కోరుతూ ఇప్పటివరకు 653 దరఖాస్తులు అందాయని, వాటిలో 73 ప్రతిపాదనలను ఆమోదించామని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు.
దేవుడి భూముల పరిరక్షణ చట్ట సవరణ
దేవదాయ భూముల ఆక్రమణను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు రానున్న కేబినెట్‌లో ఎండోమెంట్ చట్ట సవరణకు ప్రతిపాదించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దేవదాయ భూముల ఆక్రమణను కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ఎండోమెంట్ చట్టంలోని సెక్షన్–83, 84 నిబంధనలలో కొన్ని ఆటంకాలు ఉన్నట్టు గుర్తించామని, వాటిని సవరిస్తామని వివరించారు.