డిజిటల్‌ ‘సచివాలయాలు’

Video conference facility for village secretariats - Sakshi

గ్రామ సచివాలయాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం

పథకాలతో పాటు లబ్ధిదారుల పేర్లు

డిజిటల్‌ డిస్‌ప్లే.. సెంట్రల్‌ సర్వర్‌ ద్వారా విజయవాడ నుంచే మార్పులు, చేర్పులు

గ్రామ సచివాలయాలకు శాశ్వత భవనాలు

సాక్షి, అమరావతి: ఇప్పటికే సచివాలయాల ద్వారా గ్రామాల స్వరూపం మార్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి గ్రామాలకు డిజిటల్‌ విప్లవం తీసుకురాబోతోంది. ప్రస్తుతం మండలాలకే పరిమితమైన వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని గ్రామ సచివాలయాల స్థాయికి తీసుకెళ్లాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటల్‌ టీవీలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులు నేరుగా గ్రామ సచివాలయాల ఉద్యోగులు లేదా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడానికి ఈ టీవీలను ఉపయోగిస్తారు. అలాగే పథకాలతో పాటు లబ్ధిదారుల జాబితాలను కూడా డిజిటల్‌ డిస్‌ప్లే ద్వారా ప్రదర్శిస్తారు. సెంట్రల్‌ సర్వర్‌ ద్వారా విజయవాడ నుంచే లబ్ధిదారుల పేర్లు, సంఖ్య మార్చే అవకాశముంటుంది. ఏ పథకం.. ఏ నెలలో ఎప్పుడు అమలవుతుందనే వివరాలను కూడా డిజిటల్‌ డిస్‌ప్లే ద్వారా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కూడా వీటి ద్వారా తెలియజేస్తారు. దీని వల్ల పోస్టర్ల వ్యయం తగ్గుతుంది. 

ఆన్‌లైన్‌.. క్షణాల్లో సమస్యలు పరిష్కారం
ఇప్పటికే ప్రజలకు మెరుగైన సేవలను సకాలంలో అందించేందుకు  సచివాలయాన్నింటినీ కంప్యూటరీకరించారు. అలాగే ప్రత్యేకంగా డిజిటల్‌ అసిస్టెంట్లను కూడా నియమించారు. 30,008 కంప్యూటర్లు, 15,004 ప్రింటర్లు, 27,646 బయోమెట్రిక్‌ మెషిన్లు, 15,004 స్కానర్లు, 14,492 ఇంటర్నెట్, 301 బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యాలతో పాటు 2,67,224 సెల్‌ఫోన్లను ప్రభుత్వం సచివాలయాలకు ఇచ్చింది. వీటి ద్వారా ప్రభుత్వం అందించే ఏ పథకమైనా క్షణాల్లో ప్రజలకు చేరువ అవుతోంది. సమస్యలు కూడా ఇట్టే పరిష్కారమవుతున్నాయి. 

శాశ్వత భవనాలతో ఆస్తి..
గ్రామ సచివాయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామ సచివాయాలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రూ.3,833 కోట్ల విలువైన శాశ్వత భవనాల ద్వారా గ్రామాలకు ఆస్తి చేకూరనుంది. ఇప్పటికే 10,929 భవనాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఇందులో 1,848 భవనాల నిర్మాణం కూడా పూర్తయ్యింది. ఒక్కో భవనాన్ని 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఉద్యోగుల కార్యాలయంతో పాటు సమావేశ మందిరం, సందర్శకుల హాలు, గ్రామ సర్పంచ్, పంచాయతీరాజ్‌ కార్యదర్శి కార్యాలయాలను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. 

మార్చి నెలాఖరుకల్లా నిర్మాణాలు పూర్తి
సచివాలయాల కోసం శాశ్వత భవనాలు నిర్మిస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి అన్ని నిర్మాణాలు పూర్తవుతాయి. అలాగే సీఎం ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాల్లోనే వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాం. ఇందుకోసం డిజిటల్‌ టీవీల కొనుగోలుకు టెండర్లను కూడా ఆహ్వానించాం.  
– అజయ్‌ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top