3 రాజధానులకు అమరావతిలో అనూహ్య మద్దతు

Unexpected support for 3 capitals in Amaravati - Sakshi

తాళ్లాయపాలెంలో వందలాది మంది మహిళల రిలే దీక్షలు

రాజధాని గ్రామాల నుంచి తరలివస్తున్న దళితులు 

అభివృద్ధిని అడ్డుకునేందుకే చంద్రబాబు సామాజికవర్గ జడ్జిలతో పిల్‌లు

ఇండియన్ దళిత క్రిస్టియన్  రైట్స్‌ జాతీయ అధ్యక్షుడు పెరికే వరప్రసాద్‌

తాడికొండ: అమరావతిలో వికేంద్రీకరణకు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ దళిత సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు జంక్షన్  వద్ద మూడు రోజుల నుంచి రాజధాని గ్రామాల రైతులు వికేంద్రీకరణకు అనుకూలంగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షల్లో వందలాది మంది మహిళలు పాల్గొంటున్నారు. దళిత బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నాయి. రాజధానిలోని అన్ని గ్రామాల నుంచి తాళ్లాయపాలెం రిలే దీక్షా శిబిరానికి దళిత మహిళలు, యువకులు తరలివస్తున్నారు.

అమరావతి పేరుతో తమకు జరిగిన అన్యాయం, తమను మోసం చేసి భూములు లాక్కున్న టీడీపీ నేతలు, ప్రైవేటు వ్యక్తుల గురించి వారు చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని, అమరావతితోపాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని మహిళలు కోరుతున్నారు. మాలమహానాడు, ఎంఆర్‌పీఎస్, పలు ప్రజా సంఘాల నాయకులు ఈ దీక్షలకు మద్దతు తెలుపుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా రాజధానిలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, అన్ని వర్గాల మద్దతు కూడగడతామని వారు చెబుతున్నారు. 

అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం.. 
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్  రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోందని ఇండియన్  దళిత్‌ క్రిస్టియన్  రైట్స్‌ జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది పెరికే వరప్రసాద్‌ అన్నారు.  ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా సీఎం అడుగులు వేస్తుంటే దానిని కుట్రలతో తన సామాజిక వర్గ జడ్జిలతో పిల్‌లు వేయిస్తూ చంద్రబాబు అభివృద్ధికి ప్రతిబంధకంగా మారారన్నారు.

దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టేరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు తన బినామీలైన సుజనాచౌదరి, పవన్ కల్యాణ్, వామపక్షాల నాయకులు, తన కుమారుడు లోకేష్‌ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. అమరావతి ఉద్యమానికి విదేశాల నుంచి వచ్చే వేల కోట్ల రూపాయలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.  మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాస్, ఎంఏసీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బేతపూడి సాంబయ్య, రాజధాని దళిత నాయకుల అధ్యక్షుడు నూతక్కి జోషి, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొండపల్లి గిరిజ, అమరావతి రాజధాని రైతు కూలీల సంక్షేమ సంఘం కన్వీనర్‌ కట్టెపోగు ఉదయ్‌ భాస్కర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొదమల కుమార్‌  తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top