కాపురాలు కూలిపోతున్నాయి | Undavalli farmers rally against land acquisition | Sakshi
Sakshi News home page

కాపురాలు కూలిపోతున్నాయి

Jun 10 2026 4:29 AM | Updated on Jun 10 2026 4:31 AM

Undavalli farmers rally against land acquisition

ఆడపిల్లలకు ఈ పొలాల్నే కట్నంగా ఇచ్చాం

పిల్లలకు పెళ్లి చేయడం కూడా కష్టంగా మారింది 

రాజధాని అభివృద్ధి అంటూ ఇళ్లు తొలగించారు 

ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు

భూ సేకరణకు వ్యతిరేకంగా ఉండవల్లి రైతుల ర్యాలీ 

‘మా భూమి.. మా హక్కు’ అంటూ నినాదాలు 

పన్నెండేళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్నామంటూ ఆవేదన 

తమ గ్రామాన్ని భూసేకరణ నుంచి మినహాయించాలని డిమాండ్‌ 

తన పొలంలో పైపులు పీకేశారంటూ కన్నీటి పర్యంతమైన రైతు

తాడేపల్లి రూరల్‌: ‘మాకున్న కొద్దిపాటి భూముల్లో ఆడపిల్లలకు కట్నం కింద కొంత రాసిచ్చాం. ఆ భూముల్ని రాజధాని కోసం బలవంతంగా తీసేసుకుంటున్నారు. దీనివల్ల మా బిడ్డల కాపురాలు కూలిపోతున్నాయి’ అని కొందరు రైతులు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీకేంటండీ నెలనెలా జీతాలొస్తాయి. మాకు ఈ భూములే ఆధారం. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే మా భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. మా పిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేసుకోవాలి’ అని మహిళా రైతులు నిలదీశారు. 

అమరావతి ముఖద్వారమైన ఉండవల్లిలో సీఆర్‌డీఏ అధికారులు భూసేకరణ కోసం మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఉండవల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన గ్రామసభకు రైతులు ర్యాలీగా వెళ్లారు. తమ వ్యవసాయ భూములను ల్యాండ్‌ పూలింగ్, భూసేకరణ నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. ‘మా భూమి.. మా హక్కు’ అని నినదిస్తూ సభా ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత 29 గ్రామాల నుంచి ఉండవల్లి గ్రామాన్ని మినహాయించాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. 1990 ముందు నుంచే ఉండవల్లిలో పండే పంటలను, ఎగుమతులను, భూముల విలువను సీఆర్‌డీఏ అధికారులకు వివరించారు.  

కట్నం కింద రాసిచ్చాం 
పలువురు రైతులు మాట్లాడుతూ తమకున్న భూముల్లో కొంత ఆడపిల్లలకు కట్నం కింద రాసిచ్చామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో కౌలు రూ.20 వేలకు మించి ఎక్కడా లేదని, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో మాత్రం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు కౌలు వస్తుందని వివరించారు. ‘నాలుగు పంటలు పండే ఈ భూములను ఎలా తీసుకుంటారు? ఒకవేళ తీసుకుంటే అదే తరహాలో పంటలు పండే భూములను రైతులకు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నాయి’ అని అధికారులకు వివరించారు. 

మహిళా రైతులు మాట్లాడుతూ ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే మా భూమి అమ్మడానికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మా పిల్లలకు పెళ్లిళ్లు  ఎలా చేయాలని నిలదీశారు. ‘రాజధాని ప్రకటించినప్పుడే ఉండవల్లి పంచాయతీ పాలకమండలి, తాడేపల్లి మండల పరిషత్‌ పాలకమండలి రాజధానికి భూములు ఇచ్చేదిలేదని నిర్ధారించాయి. రాజధాని 29 గ్రామాల్లో ఇక్కడున్న రైతులకు చాలామందికి పొలాలు ఉన్నాయి. ఆ పొలాలను మొదటి విడతలో పూలింగ్‌కు ఇచ్చాం. ఈ భూమి ఇవ్వలేదంటే అధికారులు అర్థం చేసుకోవాలి’ అని రైతులు కోరారు.  

పన్నెండేళ్లుగా ఏం అభివృద్ధి చేశారు 
ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులు మాట్లాడుతూ.. ‘మా భూములు ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చాం. మా గ్రామం అభివృద్ధి చెందలేదు. 12 సంవత్సరాలుగా గ్రామ పరిస్థితి దారుణంగా ఉంది. వెంటనే అభివృద్ధి చేయాలి. ఉండవల్లిలో ఎత్తిపోతల పథకంతో పాటు ఎందుకూ ఉపయోగపడని ప్రాజెక్టులు పెడుతున్నారు. మా గ్రామంలో టూరిజం ప్రాజెక్ట్‌ లేదా ఐటీ సంస్థలను ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

రాజధాని అభివృద్ధి పేరుతో 12 ఏళ్ల క్రితం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కింద ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదంటూ స్థానిక ప్రజలు అధికారులను నిలదీశారు. ‘కొంతమందికి ఉండవల్లిలో గజాల కింద పొలాలు ఉన్నాయి. ఆ పొలంలో గజాల కింద 10–15 మంది ఉన్నాం. మాకు గజాల కిందే ప్లాట్లు ఇస్తామని చెప్పి అధికారులు మోసం చేశారు’ అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. 

సహకరించినా.. పంట నాశనం చేశారు 
గ్రామ సభ జరుగుతుండగా ఉండవల్లి గ్రామానికి చెందిన శిగిరిశెట్టి అనంతశివరావు కన్నీరు పెట్టుకుంటూ వచ్చి ‘సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సహకరిస్తానని చెప్పి 9.3 పత్రాన్ని అందజేశాను. దాన్ని ఆసరాగా తీసుకుని పొలంలో పంట ఉండగా దౌర్జన్యంగా కాంట్రాక్టర్లు కరెంటు స్తంభాలు తీసివేసి పైపులైన్లు పీకివేశారు’ అంటూ కాంట్రాక్టర్ల దౌర్జన్యాన్ని వీడియోలో చూపించారు. తన పొలంలో పైపుల్ని దౌర్జన్యంగా తొలగించి.. తనను పూర్తిగా నాశనమయ్యేలా చేశారని శిగిరిశెట్టి అనంత శివరావు కన్నీటిపర్యంతమయ్యారు. 

ఉండవల్లిలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి రైతులు ఏ సమస్య మీద వెళ్లినా అక్కడ ఉన్న డిప్యూటీ కలెక్టర్‌ చులకన భావనతో మాట్లాడుతున్నారని, తమ భూములు తీసుకుంటూ మమ్మల్ని ఏసీలు వేసి కూర్చోబెట్టాలా అంటూ వెటకారంగా మాట్లాడి బయటకు వెళ్లాలంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

చెల్లి కాపురం చెడిపోయేలా ఉంది 
మా తల్లిదండ్రులకు మేం ముగ్గురం. ఇద్దరు అన్నదమ్ములం, ఒక చెల్లి. మా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో ఒక ఎకరం మా చెల్లికి కట్నంగా ఇచ్చాం. అది రిజిస్ట్రేషన్ కావడం లేదు. వారి కాపురం చెడిపోయేలా ఉంది. రాజధానికి భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్లు ఆపి, బెదిరించి పొలాలు తీసుకుంటారా? మాకు వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చేసి మా ఆడపిల్లల కాపురాలు నిలబెట్టండి. – జొన్న సాంబశివరావు, రైతు

ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్థం కావడం లేదు 
భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చిన తరువాత మా ఆడపిల్లలకు పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. మీతో మాట్లాడుతుంటే ఏడుపు వ­స్తోంది. ఆ భూమిని నమ్ముకు­ని ఇప్పటిదాకా జీవించాం. మా ఆడపిల్లలకు మీరు ఇచ్చే అరకొర భూమితో ఎలా పెళ్లిళ్లు చేయాలి. మీ­రు దయవుంచి మా భూములు వదిలివేయాలి. మీ­రు ఇచ్చే భూముల్లో వ్యవసాయం ఎలా చేయగలం? – శింగంశెట్టి అనుపమ, రైతు

దేవదాయ రైతుల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి 
మా తాతలు, తండ్రుల కా­లం నుంచి దేవదాయ భూ­ముల్లో వ్యవసాయం చేసు­కుని జీవిస్తున్నాం. ఉన్న­ట్టుండి ఆ భూములను సీఆ­ర్‌డీఏ అధికారులు దున్నేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని భూముల్ని ఇప్పటికే దున్నేశారు. దానివల్ల కౌలు రైతులం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మాకూ రాజధానిలో బతికేందుకు అవకాశం కల్పించాలి. ఆ భూములను లాక్కుంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలి?  – దాసరి నాగరాజు, కౌలు రైతు 

ఉండవల్లిని విలన్‌గా చూపిస్తున్నారు 
ఉండవల్లిలో భార్యాభర్తలిద్దరూ ఒక ఎకరంలో వ్యవసాయం చేస్తే నెలకు రూ.60 వేలు సంపాదిస్తారు. కౌలు రైతు కూరగాయలు, పూలు, ఇతర పంటలు పండించి నెలకు రూ.45 వేలు సంపాదిస్తున్నాడు. ఏదో విజయవాడకు దగ్గరగా ఉందని పూలింగ్‌కు ఇవ్వనని అనడం లేదు. ఇక్కడ ఉన్న అర ఎకరం, ఎకరం భూముల్లో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం. సమాజంలో ఉండవల్లిని రాజధానికి విలన్‌గా చిత్రీకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ చేస్తున్నారు. రాజధాని నుంచి ఉండవల్లిని మినహాయించాలి. – జంగాల సాంబశివరావు, రైతు

ముందొక మాట.. తరువాత ఒక మాట 
రాజధాని వల్ల మా ఇంటిని కోల్పోయాం. మాకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌లో 26 సెంట్లు ఉంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌కు అవసరం అంటే మాకు గజాల్లో స్థలం ఇస్తామంటే మా భూమి ఇస్తామని చెప్పాం. ముందు ఇస్తామని చెప్పి ఇప్పుడు నాలుగు సెంట్లు ఇస్తామంటున్నారు. ఇప్పటికే వయసు పైబడి చేతులు వణుకుతున్నాయి. మా అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్లం దానిపైనే ఆధారపడుతున్నాం. మాకు గజాల్లో స్థలం ఇప్పించండి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం.  – శ్రీనివాసరావు, రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement