కరోనాతో ఆస్పత్రికి.. కట్‌ చేస్తే పెళ్లి

Two Guntur Youth During Covid 19 Treatment Fall In Love Get Married - Sakshi

సాక్షి, గుంటూరు: ప్రపంచ మానవాళిని బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఇద్దరు యవతీయువకులకు మాత్రం ‘ప్రేమ’ అనే మధురమైన అనుభూతి మిగిల్చింది. ఒంటరి జీవితానికి తోడునిచ్చింది. గుంటూరు లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి ఇందుకు వేదికగా మారింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఓ యువకుడు ఇటీవల కరోనా బారినపడ్డాడు. దాంతో అతను గుంటూరులోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. ఇటీవలే ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగానేషణలో ఉన్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె కూడా అదే ఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది. 

ఇద్దరివీ పక్క పక్కన బెడ్లు కావడంతో మొదట వారి మధ్య తొలి పరిచయం ఏర్పడింది. మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి. కోవిడ్‌ నుంచి గట్టెక్కేందుకు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. రెండు వారాలపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కరోనాను జయించారు. ఇంటికి వెళ్లి తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే కావడంతో ఇరుకుటుంబాల పెద్దలు అడ్డు చెప్పలేదు. దీంతో ఈ నెల 25న పొన్నూరులోని ఓ దేవాలయంలో వారి పెళ్లి కూడా జరిగింది. వీరి ప్రేమా పెళ్లి మూడు వారాల వ్యవధిలోనే జరగడం విశేషం!  ఈ ప్రేమ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top