హైకోర్టు జడ్జిగా తుహిన్‌ కుమార్‌ | Tuhin Kumar as High Court Judge Andhra Pradesh | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జిగా తుహిన్‌ కుమార్‌

Jul 4 2025 5:49 AM | Updated on Jul 4 2025 5:49 AM

Tuhin Kumar as High Court Judge Andhra Pradesh

కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు

ఆ మేరకు తీర్మానం ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 28 మంది న్యాయమూర్తులు 

తుహిన్‌ కుమార్‌ను నియమిస్తే 29కి చేరిక

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి పదవికి ప్రముఖ న్యాయవాది గేదెల తుహిన్‌ కుమార్‌ పేరును సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని న్యాయమూర్తుల కొలీజియం ఈ మేరకు తీర్మానించింది. తుహిన్‌ కుమార్‌ పేరుకు కేంద్రం ఆమోదం తెలిపాక అది ప్రధానమంత్రి కార్యాలయానికి, అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. 

రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరువాత తుహిన్‌ కుమార్‌ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులతో కలుపుకుని మొత్తం 28 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తుహిన్‌ నియామకంతో ఆ సంఖ్య 29కి చేరుకుంటుంది. హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37. తుహిన్‌ నియామకం పూర్తయితే 8 ఖాళీలు ఉంటాయి. 

త్వరలో ఇద్దరు ముగ్గురి పేర్లను హైకోర్టు కొలీజియం న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్‌ పేరును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు కొలీజియం సిఫారసుకు ఆమోదముద్ర వేసింది. 

తుహిన్‌ నేపథ్యం ఇది.. 
తుహిన్‌ కుమార్‌.. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. తుహిన్‌ కుమార్‌ పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్మీడియెట్, విశాఖపట్నం ఎన్‌బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 

1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 2000–2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ తరఫున హైకోర్టులో స్టాండింగ్‌ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement