
తిరుమల: అన్నప్రసాద కేంద్రాల్లో ఇకపై రాత్రి భోజన సమయంలోనూ భక్తులకు వడలు వడ్డించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆదివారం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి, అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పూజ నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులకు వడ్డించారు. ఆదివారం నుంచి రాత్రి భోజన సమయంలోనూ భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
రెండ్రోజులు గరుడ సేవ
జూలై 10న గురు పౌర్ణమి, జూలై 29న గరుడ పంచమి సందర్భంగా టీటీడీ రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది. శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుంది.
గోవిందరాజస్వామి వారికి జ్యేష్టాభిషేకం
గోవిందరాజస్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు తలపెట్టిన జ్యేష్టాభిషేకం ఉత్సవాలు ఆదివారం వేడుకగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాడ మాసంలో శ్రీ గోవిందరాజస్వామి వారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కోలిపి కైంకర్యాలు, శతకలశ స్నపన తిరుమంజనం, మహా శాంతి హోమం చేపట్టారు.
అనంతరం ఆలయంలోని కల్యాణ మండపానికి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అక్కడ ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారం కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై కొలువై ఆలయ మాడవీధుల్లో విహరించారు.
చదవండి: సత్యదేవుని దేవేరికి 174 వజ్రాలతో హారం