అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానం 

Ttd Committee Members On Hanuman Birth Place - Sakshi

అంజనహళ్లిలో ఆంజనేయుడు జన్మించాడంటూ గోవిందానంద స్వామి చేస్తోన్న వాదనలో పసలేదు

హనుమంతుడి జన్మస్థానంపై చర్చాగోష్టిలో టీటీడీ పండితుల కమిటీ స్పష్టీకరణ

యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): శేషాచలం కొండల్లోని అంజనాద్రియే ఆంజనేయుడి జన్మస్థానమని టీటీడీ పండితుల కమిటీ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని గత నెల 21న శ్రీరామనవమి రోజున తిరుమలలో ఆంజనేయుడి జన్మస్థానంపై పరిశోధన చేసిన కమిటీ ప్రకటించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలని కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ మురళీధర శర్మ కోరారు.

ఈ నేపథ్యంలో కర్ణాటకలోని హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి స్వామి హనుమంతుడి జన్మస్థాన ప్రకటనపై తనకున్న అభ్యంతరాలతో టీటీడీకి ఓ లేఖ రాశారు. బు«ధవారం తిరుమలకు వచ్చిన ఆయన ఆంజనేయుడి జన్మస్థలంపై చర్చాగోష్టి నిర్వహించాలని కోరారు. గురువారం జాతీయ సంస్కృత వర్సిటీలో ఆంజనేయుడి జన్మస్థానం అంశంపై చర్చ జరిగింది. దీనికి కుప్పా విశ్వనాథ శాస్త్రి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

పురాణాలు, ఇతిహాసాలే ప్రామాణికం...
చర్చ అనంతరం మురళీధర శర్మ మాట్లాడుతూ.. పురా ణాలు, కావ్య ఇతిహాసాల ప్రామాణికాలను అనుసరించి హనుమంతుని జన్మస్థానం అంజనాద్రి అని నిర్ధారిం చినట్లు చెప్పారు. అయితే హనుమ జన్మస్థానం కర్ణాట కలోని పంపానది తీరంలో ఉన్న ‘అంజనహళ్లి’గా పేర్కొం టూ గోవిందానంద సరస్వతి స్వామి టీటీడీకి లేఖ రాశా రని, అందులో ఆయన వాడిన భాష సరిగా లేదని తెలిపారు. చర్చా గోష్టిలో ఆంజనేయుడి జన్మస్థలం కంటే తిరుమలకు ఉన్న పేర్లు, హనుమంతుని జనన కాలం (తిథి) గురించే ఆయన విశ్లేషించారన్నారు. పైగా టీటీడీ చెప్పినదానికి పురాణాలు సమన్వయం కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు.

పంపానది ఒడ్డున ఉన్న అంజనహళ్లి హనుమంతుడి జన్మస్థానం అని, రామాయణంలో దీని గురించి ఉందని ఆయన చెప్పిన ప్పటికీ వాటికి ఆయన సరైన ఆధారాలు చూపలేదన్నారు. రామాయణంలో కిష్కింధకాండ, సుందరకాండ, ఉత్తర కాండలో హనుమంతుడి జన్మవృత్తాంతం గురించి మాత్రమే ఉందని, జన్మస్థానం గురించి ప్రస్తావనే లేదని మురళీధర శర్మ స్పష్టం చేశారు. గోవిందానంద స్వామి వాదాన్ని ప్రామాణాల ప్రకారం ఖండించినట్లు చెప్పారు. పురాణాలు భారత సంస్కృతికి మూలమైనవిగా అంగీక రించాలని కోరామన్నారు. ఉభయపక్షాల వాదనలు విన్న అనంతరం కుప్పా విశ్వనాథ శాస్త్రి టీటీడీ నిర్ణయం సముచితమని, గోవిందానంద స్వామి వాదనలో పసలేదని చెప్పినట్లు తెలిపారు.

ఆ అధికారం టీటీడీకి లేదు: గోవిందానంద
హనుమంతుడి జన్మస్థానంపై టీటీడీ చేసిన ప్రకటన ఆక్షేపణీయం. ఆంజనేయుడి జన్మస్థానం ప్రకటించే అధికారం టీటీడీ పండితుల కమిటీకి లేదు. ఆంజనేయుడి జన్మస్థలం గురించి పెద్దజీయర్, చిన్న జీయర్‌ స్వామి, శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యులు, కంచి పీఠాధిపతి, మధ్వాచార్యులు చెబితే ధర్మబద్ధమవుతుంది. టీటీడీ పండితుల కమిటీలో పెద్దజీయర్‌ స్వామికి ఎందుకు చోటు కల్పించలేదు? ఆయన చెబితే టీటీడీ నిర్ణయం అంగీకరిస్తాను. రామాయణం ప్రకారం హనుమంతుడు హంపిలోనే జన్మించాడు. దీనిపై టీటీడీ బహిరంగ చర్చ జరపాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top