కాగ్‌తో టీటీడీ నిధుల ఆడిట్‌ గొప్ప నిర్ణయం

TTD Audit Responsibility To CAG Is A Great Decision, MP Subramanian - Sakshi

నా ప్రతిపాదనకు సమ్మతించిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

సాక్షి, అమరావతి: కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఆడిట్‌ చేయించాలన్నది గొప్ప నిర్ణయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్‌ చేయించడంతోపాటు, ఇక ముందు కూడా ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్‌ సబర్వాల్‌తో కలసి సుబ్రహ్మణ్యస్వామి గతంలో హైకోర్టులో పిటిషన్‌ వేశారు.  

అధికారంలోకి వచ్చాక వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ అంశంపై స్వచ్ఛందంగానే సానుకూలంగా స్పందించింది.  టీటీడీ నిధులను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని నిర్ణయించారు. టీటీడీ ఆదాయ, వ్యయాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉండాలని చెప్పారు. తద్వారా టీటీడీకి భక్తులు, దాతలు విరాళాల రూపంలో ఇస్తున్న నిధుల నిర్వహణ సక్రమంగా ఉండాలని నిర్దేశించారు.  

ఈ మేరకు 2020–21 నుంచి టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని ఆగస్టు 28న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించింది. హైకోర్టుకు కూడా తెలియజేయాలని నిర్ణయించింది. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు టీటీడీ నిధుల వ్యయాన్ని కాగ్‌తో ఆడిటింగ్‌ చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.  

తన ప్రతిపాదనను సీఎం వైఎస్‌ జగన్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో సమ్మతించారని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు స్పందించిన వైవీ సుబ్బారెడ్డి పారదర్శకత, అవినీతిరహిత పాలన పట్ల సీఎం నిబద్ధతతో ఉన్నారంటూ ట్వీట్‌ చేశారు.  

చదవండి: రైతులపై రూపాయి భారం పడినా రాజీనామా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top