రైతులపై రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా

Balineni Srinivasa Reddy Fires On Chandrababu - Sakshi

కరెంట్‌ అడిగితే కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది: మంత్రి బాలినేని

అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్‌ పాలన

ఒంగోలు: ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లుగా ఉచిత విద్యుత్‌కు సంబంధించి రైతులపై ఒక్క రూపాయి భారం పడినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్‌ చేశారు. బుధవారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులా రైతులపై కాల్పులకు ఆదేశించి కన్నీరు కార్చడం తమకు చేతకాదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. (రైతులు పైసా కట్టక్కర్లేదు)

► కేంద్ర ప్రభుత్వం నాలుగు రంగాల్లో నగదు బదిలీని తెచ్చింది. అందులో భాగంగానే విద్యుత్‌ శాఖలోనూ నగదు బదిలీ అమలు చేయాల్సి వస్తోంది. 

► రైతులపై రూపాయి కూడా భారం పడకుండా కరెంటు బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి ముందుగానే జమ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అన్నదాతలు తమ ఖాతాల్లో నగదు జమ అయిన తరువాతే బిల్లు మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తారు. 

► రైతులు నేరుగా బిల్లులు చెల్లించడం ద్వారా నాణ్యమైన కరెంట్‌ సరఫరాకోసం విద్యుత్తు శాఖ సిబ్బందిని ప్రశ్నించే వీలుంటుంది. 

► ముఖ్యమంత్రి జగన్‌ రైతుల పక్షపాతి. పంటలకు గిట్టుబాటు ధరలకోసం ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.70 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేశారు. రైతులకు పగటిపూట 9 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు నిధులు కావాలని అధికారులు అడిగిన వెంటనే రూ.1,700 కోట్లు మంజూరు చేశారు. 

► దివంగత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యం.

బషీర్‌బాగ్‌ కాల్పులు గుర్తున్నాయ్‌ బాబూ..
► ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యుత్‌ను అవహేళన చేయడమే కాకుండా హైదరాబాద్‌లో రైతులపై కాల్పులకు ఆదేశించిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుంది. ఆయన నిర్వాకాలను ఎవరూ మరచిపోలేదు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top