విజయవాడ నుంచి దువ్వాడకు మొదటి ‘త్రిశూల్‌’ 

Trishul train was successfully operated from Vijayawada division - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే మొదటిసారిగా ‘త్రిశూల్‌’ రైలును విజయవాడ డివిజన్‌ నుంచి విజయవంతంగా నడిపించారు. మూడు గూడ్స్‌ రైళ్లను జతపరిచి మొత్తం 176 వ్యాగన్లతో ఒకే రైలుగా ఏర్పాటు చేసి, దీనికి ‘త్రిశూల్‌’ అని పేరుపెట్టారు. ఈ రైలును గురువారం విజయవాడ నుంచి దక్షిణ మధ్య రైల్వే చివరి స్టేషన్‌ అయిన దువ్వాడ వరకు నడిపారు. ‘త్రిశూల్‌’ గంటకు 50 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణించింది.

వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు, ఖాళీ వ్యాగన్లను లోడింగ్‌ పాయింట్‌కు తక్కువ సమయంలో చేర్చేందుకు, భారీ డిమాండ్‌ ఉన్న సరుకుల రవాణాకు ఈ త్రిశూల్‌ రైలు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ త్రిశూల్‌ రైలు నిర్వహణకు కృషి చేసిన విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top