సిగ'ధర'గ! | Tobacco Farmers In Crisis As Prices Fall Below ₹200 After CM Chandrababu’s Announcement, More Details Inside | Sakshi
Sakshi News home page

సిగ'ధర'గ!

Jun 20 2026 5:15 AM | Updated on Jun 20 2026 12:41 PM

Tobacco prices crash following Chandrababu naidu announcement

చంద్రబాబు ప్రకటనతో పొగాకు ధర ఢమాల్‌

శుక్రవారం సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.182.09 

కంపెనీలతో కుమ్మక్కై.. పొగాకు రైతుల జీవితాలతో చెలగాటం

పైగా అన్ని కేంద్రాల్లో బేళ్లు తిరస్కరణ 

మరింత సంక్షోభంలో కూరుకుపోతున్న కర్షకులు 

సాక్షి, అమరావతి: సంక్షోభంలో ఉన్న రైతులకు ఏ ప్రభుత్వాధినేతైనా భరోసా ఇవ్వాలి. అంతే కానీ వారిని మరింత సంక్షోభంలో నెట్టే యత్నం చేయకూడదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రంలో కర్షకులను నిలువునా ముంచేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ పొగాకు రైతులపై ప్రభుత్వ ఉదాసీన వైఖరే నిదర్శనం. గురువారం పొగాకు రైతులు, కంపెనీల ప్రతినిధులతో సమీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో పొగాకు సరాసరి ధర కిలోకు రూ.200కు తగ్గకూడదని ప్రకటించారు. 

సీఎం స్థాయి వ్యక్తి ప్రకటన తర్వాత సరాసరి ధర పెరగాల్సిందిపోయి మరింత పతనమైపోయింది. దీంతో పొగాకు రైతులు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం నెలకొంది.  సీఎం ప్రకటన తర్వాత శుక్రవారం (జూన్‌ 19న) సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.182.09కు దిగజారిపోవడమే ఇందుకు నిదర్శనం. శుక్రవారం కనిష్ట ధర  రూ.160 కాగా, గరిష్ట ధర రూ.250 పలికింది. దాదాపు అన్ని కేంద్రాల్లోనూ సరాసరి అమ్మకం ధరలు రూ.200కు దిగువనే రికార్డవడం ఆందోళనకు గురిచేస్తోంది. 

సీఎం ప్రకటనకే విలువ లేదా?  
2023–24 మార్కెటింగ్‌ సీజన్‌తో పోలిస్తే గడిచిన రెండు సీజన్ల నుంచి ధర లేక రాష్ట్రంలో పొగాకు రైతులు విలవిల్లాడుతున్నారు. రబీ 2025–26 సీజన్‌లో పొగాకు పంటకు మే 25 నా­టికి సరాసరి అమ్మకం ధర కిలోకు 
రూ.237.­21­కు పడిపోగా, ఆ తర్వాత వరుసగా జూన్‌ 1 నాటికి రూ.235.63కు, 9వతేదీ నాటికి రూ.­232కు, జూన్‌ 11 నాటికి రూ 230.58కు, 18వ తేదీ నాటికి రూ.184.26కు దిగజారింది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత శుక్రవారం సరా­సరి అమ్మకం ధర 182.09కు పతనమైంది. 

దక్షిణాది తేలిక నేలల్లో పొగాకు సరాసరి అమ్మకం ధర జూన్‌ 1న రూ.231.02 పలుకగా, జూన్‌ 9న రూ.228.39 పడిపోయింది. 15న రూ.210.96 పలుకగా, సీఎం ప్రకటన తర్వాత 19న రూ.­200­కు దిగజారిపోయింది. దాదాపు అన్ని వేలం కేంద్రాల్లో సరాసరి అమ్మకం ధరలు కిలోకు రూ.200కు దిగువనే నమోదవుతున్నాయి. ప్రధానంగా వెల్లంపల్లి–2 వేలం కేంద్రంలో రూ.183.26, ఒంగోలు–1లో రూ.181.39, ఒంగోలు–2లో రూ.182.77, టంగుటూరులో రూ.190.49, కనిగిరిలో రూ.187.8కు పడిపోయింది. 

సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత ఇంత దారుణంగా  సరాసరి అమ్మకం ధరలు దిగజారిపోతుండడంతో పొగాకు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొనుగోలు కంపెనీల సమక్షంలోనే సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు విలువ ఇంకెక్కడ ఉందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కంపెనీలతో చంద్రబాబు సర్కారు కుమ్మక్కై రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

2023–24తో పోలిస్తే తీవ్ర నష్టం  
రబీ 2023–24 మార్కెటింగ్‌ సీజన్‌ సరాసరి అమ్మకం ధర రూ.288.65 లభించింది. 2024–25 సీజన్‌లో సరాసరి అమ్మకం ధర కిలోకు రూ.248.86 మించలేదు. ఇక 2023–24 సీజన్‌లో దక్కిన సరాసరి అమ్మకం ధరలతో పోలిస్తే కిలోకు రూ.106.56 మేర రైతులు నష్టపోతున్నారు. దీనికి పెరిగిన ఉత్పత్తి వ్యయం ఏటా కిలోకు కనీసం రూ.10 చొప్పున రెండేళ్లలో రూ.20 అదనపు నష్టం కలుపుకోవాలని రైతులు చెబుతున్నారు.  

బేళ్లూ తిరస్కరణ 
మరొక వైపు తిరస్కరణకు గురయ్యే బేళ్లు ఉండ కూడదని, నో బిడ్‌కు చాన్స్‌ ఇవ్వొద్దంటూ సీఎం చంద్రబాబు ప్రకటించగా, 19న ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు–1, కొండేపి, వెల్లంపల్లి కేంద్రాల్లో సగటున 38.16 శాతం బేళ్లు , పొదిలి –1, కనిగిరి, శ్రీకందుకూరు –1, కందుకూరు –2, డీసీ పల్లిల్లో 24.21 శాతం బేళ్లు తిరస్కరణకు గురి కావడం ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతోంది. 

మరొక వైపు 17వ తేదీతో పోలిస్తే నో బిడ్‌ బేళ్లు పెరిగాయని చెప్పక తప్పని దుస్థితి. ఇలా తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లడానికి బేలుకు రూ.2 వేలు అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. మరొక వైపు ప్రస్తుత సీజన్‌లో 260.65 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి అంచనా కాగా, వేలం కేంద్రాలు ప్రారంభించి 65 రోజులు దాటిన తర్వాత కూడా 50.82 మిలియన్‌ కిలోలకు మించి వేలం జరగలేదంటే ఏ స్థాయిలో పొగాకు వేలం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. 

ఆత్మహత్యలే శరణ్యం  
రెండు బ్యారన్లకు 18 ఎకరాల్లో వర్జీనియా పొగాకు సాగు కోసం ఎకరానికి రూ.2.50 లక్షలు పెట్టుబడి పెట్టా. దాదాపు 160 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. టంగుటూరు వేలం కేంద్రానికి తొలుత నాలుగు బేళ్లను తీసుకెళ్తే 2 బేళ్లను వెనక్కి పంపేశారు. తీసుకున్న బేళ్లకూ  కిలోకు రూ.200 మించి ఇవ్వలేదు. మరోసారి నాలుగు బేళ్ళు తీసుకెళ్తే మళ్ళీ  2 తిరస్కరించారు.  కొన్నదానిలో ఒకదాన్ని రంగులేదనే సాకుతో వెనక్కి పంపేశారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి  పొగాకు కొనకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం.     – రాయండ్ల వెంకట నారాయణ, పొందూరు, ప్రకాశం జిల్లా 

సరాసరి అమ్మకం ధర పతనం  
సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత సరా­సరి అమ్మకం ధరలు మరింత దిగజారిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. చరిత్రలో తొలిసారి వైఎస్‌ జగన్‌ హయాంలో పొగాకును కూడా మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొన్నారు. ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడం లేదు.   – ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement