
సాక్షి,,అమరావతి: సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ ఎం.గురుమూర్తి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు సీఎంకు గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. తనను తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటిస్తారని అసలు ఊహించలేదన్నారు.
సీఎం జగన్‌లో ఉన్న గొప్ప వ్యక్తిత్వాన్ని ఏ రాజకీయ నేతలోనూ చూడలేదని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఏ పని చెబితే ఆ పనిని శక్తి వంచన లేకుండా చేస్తానన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాభివృద్ధి ప్రజల్లోకి వెళ్లిందని.. అందుకే టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఆశీస్సులతో పార్టీలోని పెద్దల సహకారంతో, మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల కృషితో తాను కూడా తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి అఖండ మెజార్టీతో గెలుపొందుతానన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు.