గర్భిణులకు అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్‌  | Tifa scanning at 18 to 22 weeks gestation | Sakshi
Sakshi News home page

గర్భిణులకు అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్‌ 

May 14 2023 5:26 AM | Updated on May 14 2023 2:27 PM

Tifa scanning at 18 to 22 weeks gestation - Sakshi

సాక్షి, అమరావతి: గర్భిణులు, తల్లీ బిడ్డల సంరక్షణకు ఇప్పటికే పలు రకాల కార్యక్రమాలను చేపడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు గర్భిణులకు అత్యాధునిక టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌ (టిఫా) స్కానింగ్‌ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది.

తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఈ పరీక్ష దోహద పడుతుంది. ఖరీదైన ఈ స్కాన్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా నిర్వహించనుంది. ఒక్కో టిఫా స్కాన్‌కు రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 

ఈ లోపాలున్న వారికి టిఫా స్కాన్‌
మేనరికం వివాహాలు చేసుకున్న వారికి, బ్యాడ్‌ అబ్‌స్ట్రెటిక్‌ హిస్టరీ (గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలుండటం), క్రోమోజోమ్స్, మానసిక లోపాలు (మెంటల్‌ డిజెబిలిటీ), సింగిల్‌ జీన్‌ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వంటి సమస్యలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.  ఇలాంటి లోపాలన్నింటినీ టిఫా స్కాన్‌తో గుర్తించే అవకాశం ఉంది.

శిశువు గర్భంలో ఏ పొజిషన్‌లో ఉంది? జరాయువు/మావి (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉంది? ఉమ్మ నీరు స్థితి, శిశువులో ఇతరత్రా లోపాలను దీని ద్వారా గుర్తించి, వెంటనే సరిదిద్దడానికి వీలుంటుంది. జరాయువు, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ/సిజేరియన్‌ ప్రసవం అవసరం అవుతుందా అన్నది కూడా అంచనా వేయవచ్చు.

18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో ఈ స్కానింగ్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణులకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలేమీ లేని వారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌లు చేస్తారు.

ఇప్పటికే పలు రకాలుగా అండగా
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తల్లీ బిడ్డల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేంత వరకు అండగా ఉంటోంది. ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా గ్రామాల్లోనే గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య సేవలు చేయిస్తోంది. అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది.

పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను 108 అంబులెన్స్‌ల ద్వారా నిమిషాల్లో ఆస్పత్రులకు చేరుస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డెలివరీ సేవలు పొందిన మహిళలకు ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న వారిలో గర్భిణులు రెండో స్థానంలో ఉన్నారు.

2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.31 లక్షల మంది గర్భిణులు ప్రసవం సేవలు పొందారు. మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవానంతరం గర్భిణులను వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ద్వారా క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు.

గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తూ టిఫా స్కాన్‌ను ఉచితంగా చేస్తున్నాం.  గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేశాం.

హై రిస్క్‌ గర్భిణులను డెలివరీ డేట్‌కు ముందే ఆస్పత్రికి తరలిస్తున్నాం. తద్వారా వారికి మెరుగైన వైద్య సంరక్షణ అందించి తల్లి, బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రసవానికి అవకాశం ఉంటోంది. – జె. నివాస్, ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ కమిషనర్‌

శిక్షణ పూర్తయింది
గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌ చేయడానికి వీలుగా ప్రొసీ­­జర్‌లను ఆన్‌లైన్‌లో పొ­ం­­­దుపరిచాం.  ఏ వి­ధం­గా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలనే విషయం­పై నెట్‌వర్క్‌ ఆస్పత్రుల మెడికోలు, డే­టా­ఎంట్రీ ఆప­రేటర్లకు శిక్షణ ఇచ్చాం. వైఎస్సార్‌ ఆరో­గ్యశ్రీ పథకం లబ్ధిదారులైన మహిళలు అందరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. – ఎం.ఎన్‌. హరేంధిరప్రసాద్,  వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement