5 ఫిషింగ్‌ హార్బర్లకు టెండర్లు ఓకే 

Tenders approved for 5 fishing harbors Andhra Pradesh - Sakshi

బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం పనులు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ 

రూ.1,496.85 కోట్లతో నిర్మాణం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో చేపట్టే 5 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ టెండర్లను విశ్వ సముద్ర ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. రెండో దశ కింద రూ.1,496.85 కోట్ల వ్యయంతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం)లలో నిర్మించే ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు టెండర్లు పిలిచింది.

అతి తక్కువ ధర కోట్‌ చేసిన విశ్వ సముద్ర టెండర్లు దక్కించుకున్నట్లు మారిటైమ్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే తొలి దశ కింద రూ.1,204 కోట్లతో ఉమ్మడి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్టా జిల్లా మచిలీపట్నం, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ ఫిషింగ్‌ హర్బర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

ఈ పనులను ఎంఆర్‌కేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ వేగంగా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రూ.3,622.86 కోట్లతో 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 60 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. 10 వేల మెకనైజ్డ్‌ బోట్లు నిలుపుకునే అవకాశం ఏర్పడుతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top