శ్రీశైలం–సాగర్‌ మధ్యలో కృష్ణమ్మ మాయం! 

Telangana Government False Water Calculations - Sakshi

రెండున్నర నెలల్లో సాగర్‌కు విడుదలైన నీటిలో 55.36 టీఎంసీలు అదృశ్యం

నదిలో, నదీ గర్భంలో రెండు మూడు టీఎంసీలకు మించి ఉండే అవకాశం లేదు

52 టీఎంసీలను ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా దారి మళ్లించేసిన తెలంగాణ 

అది కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు లెక్కలు చెబుతోందంటోన్న నీటిపారుదల నిపుణులు

వాటిని తెలంగాణ కోటా కింద లెక్కించాలని బోర్డును కోరనున్న ఏపీ జలవనరుల అధికారులు

సాక్షి, అమరావతి: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ మధ్య కృష్ణా నదిలో ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఆగస్టు 11వతేదీ మధ్య ఏకంగా 55.36 టీఎంసీలు మాయమయ్యాయి! ఆ నీటిని ఏ ఇంద్రజాలికుడూ అదృశ్యం చేయలేదు. మరి అన్ని జలాలు హఠాత్తుగా ఏమయ్యాయి..? ఎగువ నుంచి నాగార్జునసాగర్‌కు చేరిన నీటిని సాగర్‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీల ద్వారా తెలంగాణ సర్కార్‌ దారి మళ్లించేసింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ సర్కారు తప్పుడు నీటి లెక్కలు చెబుతోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

ప్రవాహాలు ఏమయ్యాయి..? 
శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం కనీస స్థాయికి దిగువన ఉన్నప్పటికీ ప్రాజెక్టు నిర్వహణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ, కృష్ణా బోర్డు ఉత్తర్వులను బేఖాతర్‌ చేస్తూ గత జూన్‌ 1వతేదీన తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద ప్రవాహం రావడం వల్ల శ్రీశైలంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడంతో గత నెల 28న గేట్లు ఎత్తివేసి దిగువకు ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 11 వరకు శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 11,21,506 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్‌ దిగువకు తరలించేసింది.

మరోవైపు గత నెల 27 నుంచి బుధవారం వరకూ కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ ఏపీ ప్రభుత్వం 4,70,117 క్యూసెక్కులను దిగువకు వదిలేసింది. ఇక గత నెల 28 నుంచి బుధవారం వరకూ స్పిల్‌ వే గేట్ల ద్వారా 25,48,229 క్యూసెక్కులను దిగువకు వదిలేశారు. అంటే కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాలు, స్పిల్‌ వే గేట్ల ద్వారా దిగువకు 41,39,852 క్యూసెక్కులు (357.70 టీఎంసీలు) శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేశారు. అయితే ఇందులో 34,99,204 క్యూసెక్కులు (302.34 టీఎంసీలు) మాత్రమే నాగార్జునసాగర్‌కు చేరాయని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. మరి శ్రీశైలం, సాగర్‌ మధ్యన కృష్ణా నదిలో 6,40,648 క్యూసెక్కులు (55.36 టీఎంసీలు) ఏమయ్యాయన్న అంశంపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నోరుమెదపడం లేదు.

వాటిని లెక్కలోకి తీసుకున్నా... 
శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌ మధ్య కృష్ణా నది పొడవు సుమారు 73 కి.మీ. ఉంటుంది. ప్రవాహం రూపంలో, నదీ గర్భంలో భూగర్భ జలాల రూపంలో రెండు మూడు టీఎంసీలకు మించి ఉండే అవకాశం లేదని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 52 టీఎంసీలు మాయమైనట్లు స్పష్టమవుతోంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు), ఇతర ఎత్తిపోతల ద్వారా కృష్ణా  జలాలను మళ్లించేసిన తెలంగాణ సర్కార్‌ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు శ్రీశైలం నుంచి సాగర్‌కు విడుదల చేసిన నీటిపై తప్పుడు లెక్కలు చెబుతోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తెచ్చి ఆ నీటిని తెలంగాణ సర్కార్‌ కోటా కింద లెక్కించాల్సిందిగా కోరాలని ఏపీ జలవనరుల శాఖ వర్గాలు నిర్ణయించాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top