వాల్మీకిపురం: కూటమి ప్రభుత్వ శ్రేణులకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులతో భయ భ్రాంతులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దల తీరునే వారి శ్రేణులు కూడా అనుసరిస్తున్నాయి. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ. టోల్‌గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపకూడదంట. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపినందుకు టోల్‌గేట్ సిబ్బందిని చితకబాదారు కల్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు.
ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు.. టోల్‌గేట్ సిబ్బందిని చితకబాది మరి తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. టోల్‌గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపాల్సి ఉండగా సురేంద్ర బాబు అనుచరులు నానా హంగామా చేశారు. తమ వాహనాన్నే ఆపుతారా అంటూ టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే టోల్‌గేట్ సిబ్బందిని చితకబాదారు, అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం గండబోయిన పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నానా బీభత్సం సృష్టించిన సురేంద్ర బాబు అనుచరులు.. చివరకు టోల్‌గేట్ మేనేజర్‌ను కారులో ఎత్తుకెళ్లిపోయారు. మహిళా సిబ్బంది పట్ల కూడా విచక్షణా రహితంగా ప్రవర్తించారు. మహిళా సిబ్బందిని జట్టుపట్టుకుని ఈడ్చేసి దాడికి పాల్పడ్డారు.


