అనంత‌లో టీడీపీ నేత‌ల దౌర్జన్య కాండ

TDP Leaders Overaction in Anantapur  - Sakshi

అనంతపురం: యాడికి మండలంలోని కోనుప్పలపాడులో టీడీపీ నేతలు చెలరేగారు. యానిమేటర్‌ పోస్టు చేజారి పోతున్నదన్న అక్కసుతో ఓ కుటుంబంపై కర్రలతో దాడికి తెగబడ్డారు. పోలీసులు, వైకేపీ ఏపీఎం చంద్రశేఖర్‌ తెలిపిన మేరకు... కోనుప్పలపాడు గ్రామ సర్పంచ్‌ రమాదేవి భర్త రామాంజనేయులు, మరో మహిళ లక్ష్మీదేవి ఆ గ్రామంలో వైకేపీ యానిమేటర్లుగా పనిచేసేవారు. కొంత కాలంగా లక్ష్మీదేవి విధులు సక్రమంగా నిర్వహించడం లేదు.

 రామాంజనేయులు భార్య ప్రజాప్రతినిధి కావడంతో నిబంధనల మేరకు అతన్ని కూడా యానిమేటర్‌ బాధ్యతల నుంచి తప్పిస్తూ రెండు పోస్టుల్లో అదే గ్రామానికి చెందిన గ్రీష్మ, ప్రసన్నను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఈ విషయంపై గ్రామంలో మహిళా సంఘాల సభ్యుల అభిప్రాయ సేకరణకు మంగళవారం వైకేపీ సీసీ పద్మావతి సమావేశం నిర్వహించారు. 

విషయం తెలుసుకున్న రామాంజనేయులు, తన అనుచరులను వెంటబెట్టుకుని సమావేశం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని గ్రీష్మతో పాటు ఆమె భర్త రామకృష్ణ, అత్త రామసుబ్బమ్మపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అక్కడకి చేరుకునేలోపు టీడీపీ వర్గీయులు పారిపోయారు. గాయపడిన గ్రీష్మ కుటుంబసభ్యులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన రామాంజనేయులు, రాజా, నాగార్జున, శివ, ధనలక్షి్మ, సింహాద్రి, దాసుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top