పచ్చ నేతలకు చంద్రన్న తోఫా! | TDP Govt Occupies Waqf Lands In Andhra Pradesh, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

పచ్చ నేతలకు చంద్రన్న తోఫా!

May 26 2025 6:20 AM | Updated on May 26 2025 10:08 AM

TDP Govt Occupies Waqf Lands: Andhra pradesh

పాతమల్లాయపాలెం వక్ఫ్‌ భూములు

రాజధాని ప్రాంతంలో రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్‌ భూములపై కన్ను

గుంటూరు పెద్ద మసీదు, చినకాకాని అంజుమన్‌ ఏ ఇస్తామీయా భూములకు ఎసరు

నిబంధనలకు విరుద్ధంగా ఏపీఐఐసీకి బదలాయిస్తున్న సర్కారు

ఇండస్ట్రియల్‌ పార్కు పేరుతో చేజిక్కించుకునేందుకు సన్నద్ధం

అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వక్ఫ్‌ బోర్డుకు ఆర్డీవో లేఖ.. పెద్దల తరఫున చక్రం తిప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు 

ముస్లిం సంఘాల ఆగ్రహం.. పోరుబాటకు సన్నద్ధం

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ఎక్కడ భూములు కనిపించినా కబళిస్తున్న కూటమి సర్కారు వక్ఫ్‌ భూములనూ వదలడం లేదు. నిరుపేద ముస్లింల సంక్షేమం కోసం వినియోగించేందుకు దాతలు అల్లా పేరుతో వక్ఫ్‌ చేసిన ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా అన్యాక్రాంతం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వక్ఫ్‌ భూములు కబ్జాలకు గురి కాగా తాజాగా రాజధాని ప్రాంతంలో రూ.వందల కోట్ల విలువైన భూములను కొట్టేసేందుకు పచ్చ నేతలు స్కెచ్‌ వేశారు. గుంటూరు జిల్లాకు చెందిన కీలక ప్రజా ప్రతినిధులు వక్ఫ్‌ భూములను అక్రమ మార్గంలో దక్కించుకునేందుకు పావులు కదుపుతు­న్నారు. గుంటూరులోని షాయి జామియా మసీదు (పెద్ద మసీదు), అంజుమన్‌ ఏ ఇస్తామీయా సంస్థలకు చెందిన 300 ఎకరాలకుపైగా వక్ఫ్‌ భూము­లను ఇండస్ట్రియల్‌ పార్కుల కోసం ఏపీఐఐసీకి బదలాయించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

గుంటూరు పెద్ద మసీదుకు ప్రత్తిపాడు మండలంకొత్తమల్లాయపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 232–1, 2లో 233.18 ఎకరాల భూములున్నాయి. వీటిని ఇండస్ట్రియల్‌ పార్కు కోసం ఏపీఐఐసీకి అప్పగించాలంటూ వక్ఫ్‌ బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు. ఈమేరకు గుంటూరు ఆర్డీవో కె.శ్రీనివాసరావు వక్ఫ్‌ కార్యనిర్వహణ అధికారి (సీఈవో)కి లేఖ రాశారు. ఇక అంజుమన్‌ ఏ ఇస్లామీయ వక్ఫ్‌ సంస్థకు చినకాకాని గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వెనుక ఉన్న 78 ఎకరాల వక్ఫ్‌ భూమిని సైతం ఇండస్ట్రియల్‌ పార్కు కోసం అప్పగించాలని తెనాలి ఆర్డీవో లేఖ రాశారు.

ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఆగమేఘాలపై రంగంలోకి దిగిన అధికారులు మూడు పర్యాయాలు మల్లాయపాలెం, చినకాకాని భూములను సందర్శించి ఇండస్ట్రియల్‌ పార్కుకు అప్పగించేలా చర్యలు చేపట్టారు. ఈ భూములను అప్పగించేలా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ నసీర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కలిసి పెద్ద మసీదు కమిటీ పెద్దలపై ప్రభుత్వ పెద్దల తరఫున తీవ్ర ఒత్తిడి తెచ్చి ఒప్పించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన పట్ల ముస్లిం సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. పోరుబాటకు సన్నద్ధం అవుతున్నాయి. 

నిబంధనలకు విరుద్ధం 
వక్ఫ్‌ భూములను లీజుకు ఇవ్వడం, విక్రయించడం, బహుమతి(గిఫ్ట్‌)గా ఇవ్వడం చెల్లదని వక్ఫ్‌ చట్టం 1995 సెక్షన్‌ 51 స్పష్టం చేస్తోంది. కూటమి సర్కారు నిర్భీతిగా వక్ఫ్‌ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు రూ.500 – 600 కోట్ల విలువ చేసే 311.18 ఎకరాలను భూ సేకరణ పేరుతో ఏపీఐఐసీకి కారుచౌకగా అప్పగించేందుకు సిద్ధమైంది. కీలక నేత ఆదేశాలతో రిజిస్ట్రేషన్‌ విలువలో 25 శాతం ధరకే అప్పగించేలా ప్రతిపాదనలు రూపొందించడం విస్తుగొలుపుతోంది.

⇒  గుంటూరు పెద్ద మసీదు, అంజుమన్‌ ఏ ఇస్లా­మియాకు చెందిన రూ.వందల కోట్ల విలువైన భూములను ఇండస్ట్రియల్‌ పార్క్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ భూ సేకరణ చట్టం 2018 సెక్షన్‌ 22 ప్రకారం అతి తక్కువ ధరకు ఏపీఐఐసీకి అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఆ భూములను తన వ్యాపార సామ్రా­జ్యానికి ‘కేంద్ర’ బిందువుగా చేసుకో­వాలని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక ప్రజా­ప్రతినిధి పావులు కదుపుతున్నారు. సంగం డెయి­రీ తరహా­లో భారీగా పాల శీతలీకరణ ప్లాంటు, అనుబంధ యూనిట్లతోపాటు కారం పొడి తయారీ పరిశ్ర­మల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

⇒  ముస్లింల సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబు ఆది నుంచి రెండు నాలుకల ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్‌లో వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఆమోదించిన రోజే రాష్ట్రంలో వక్ఫ్‌ భూములను లీజుకు ఇచ్చేందుకు వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అజీజ్‌ పత్రికా ప్రకటన ఇవ్వడంపై ‘వక్ఫ్‌ ఆస్తులకు ఎసరు’ పేరుతో ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై కలకలం రేగడంతో రాష్ట్రంలో వక్ఫ్‌ ఆస్తులను లీజుకు ఇచ్చేది లేదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు లీజుకు ఇచ్చేది లేదన్న సీఎం ఇప్పుడు ఏకంగా వక్ఫ్‌ భూములను కారుచౌకగా ఇతరులకు కట్టబెట్టేందుకు 
సిద్ధం కావడంపై ముస్లిం సమాజం మండిపడుతోంది.

భూములు దోచుకునేందుకే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూములు దోచుకునే ప్రయత్నం చేస్తోంది. కొద్ది ఎకరాల్లో మాత్రమే ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేసి, మిగతాది కమర్షియల్‌గా దోచుకునే ప్రయత్నానికి తెర తీశారు. వక్ఫ్‌ భూములను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం. ఎంతటి పోరాటాలకైనా వెనుకాడం.
– షేక్‌ నూరి ఫాతిమా, వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు

ఇది దుర్మార్గ చర్య 
వక్ఫ్‌ సవరణ బిల్లుకు టీడీపీ కూటమి ప్రభుత్వం మద్దతివ్వడమే కాక రాష్ట్రంలో వక్ఫ్‌ భూములను ప్రైవేట్‌ వారికి అప్పగించే కుట్రలు ప్రారంభించడం దుర్మార్గం. ఏపీ­ఐఐసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తే కచ్చితంగా ఆ మొత్తం భూమిని ముస్లిం సమాజానికే కేటాయించాలి. ఏ ఇతర కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించినా సహించేది లేదు. – గులాం రసూల్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ నాయకుడు

ముస్లింల సంక్షేమం కోసమే వినియోగించాలి
ప్రభుత్వం వక్ఫ్‌ లీజు నిబంధనలకు అనుగుణంగా వక్ఫ్‌ భూములను లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఏకపక్షంగా ఇవ్వడానికి కుదరదు. ఇదే 233 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం పరిశీలిస్తే ముస్లిం సంఘాలు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన ఉపసంహరించుకున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీకి ఈ భూములు ఇస్తే వాటిని కేవలం ముస్లిం సంక్షేమం కోసం మాత్రమే వినియోగించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. – మొహమ్మద్‌ ఖలీం, ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు 

Advertisement
 
Advertisement
Advertisement