నీటి లెక్కలు తేల్చిన తుంగభద్ర బోర్డు 

TB Board Comments On Water calculations of AP, Telangana and Karnataka states - Sakshi

సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయం(టీబీ డ్యామ్‌)లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను టీబీ బోర్డు తేల్చింది. ఈ నీటి సంవత్సరంలో బోర్డు అంచనా వేసిన లభ్యత కంటే 7.80 టీఎంసీలు డ్యామ్‌లో అధికంగా లభించాయి. డ్యామ్‌లోని నీటిని దామాషా పద్ధతిలో దక్కిన కోటాలో ఏపీ 52.831, తెలంగాణ 5.253, కర్ణాటక 111.673 టీఎంసీలను వినియోగించుకున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో డ్యామ్‌లోకి భారీ ఎత్తున ప్రవాహ జలాలు వచ్చినా.. రబీలో నిలిచిపోవడంపై బోర్డు వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

ఎగువన కర్ణాటక సర్కార్‌ అక్రమంగా భారీగా ఎత్తిపోతల పథకాలను చేపట్టడం వల్లే వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి చేరడం లేదని.. ఇది ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టం చేస్తున్నాయి. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన టీబీ డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌.. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో 8 టీఎంసీలు పోను హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల ద్వారా కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 6.51 కలిపి మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేసింది.  

దామాషా పద్ధతిలో.. 
నీటి సంవత్సరం ఏటా జూన్‌ 1న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. 2020–21 నీటి సంవత్సరం ప్రారంభంలో జూన్‌ 9, 2020న డ్యామ్‌లో 163 టీఎంసీల లభ్యత ఉంటుందని బోర్డు అంచనా వేసింది. ఆ తర్వాత నవంబర్‌ 11న 168 టీఎంసీలు, డిసెంబర్‌ 20న 170.80 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసింది. ఈ నీటిని బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన మేరకు.. దామాషా పద్ధతిలో కర్ణాటకకు 111.979, ఏపీకి 53.576, తెలంగాణకు 5.245 టీఎంసీలను కేటాయించింది. ఇందులో మూడు రాష్ట్రాలు 169.757 టీఎంసీలు వాడుకున్నాయి. 

రబీలో డీలా.. 
మే 30 2020 నాటికి డ్యామ్‌లో 1,584.56 అడుగుల్లో 6.35 టీఎంసీలు నిల్వ ఉండేవి. జూన్‌ 1 నుంచి సెపె్టంబర్‌ 30 వరకూ ఖరీఫ్‌ సీజన్‌లో డ్యామ్‌లోకి  288.477 టీఎంసీల ప్రవాహం వచ్చింది. మూడు రాష్ట్రాలు 92.661 టీఎంసీలు వాడుకున్నాయి. డ్యామ్‌ నిండటంతో గేట్లు ఎత్తేసి 92.443 టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 3.913, 2.597 వృథా అయ్యాయి. రబీ సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి.. అంటే అక్టోబర్‌ 1 నాటికి 1,627.90 అడుగుల్లో 82.425 టీఎంసీలు నిల్వ ఉండేవి.

అక్టోబర్‌ 1, 2020 నుంచి ఏప్రిల్‌ 4, 2021 వరకూ డ్యామ్‌లోకి కేవలం 3.982 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి భారీగా వచ్చేది. కానీ.. కర్ణాటక ఎగువన భారీగా అక్రమ ఎత్తిపోతల చేపట్టి.. నీటిని తోడేస్తుండటం వల్ల రబీలో డ్యామ్‌లోకి ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోయింది. రబీలో మూడు రాష్ట్రాలు 77.096 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 2.412, 1.999 టీఎంసీలు వృథా అయ్యాయి. ఈ నెల 10 నాటికి డ్యామ్‌లో 4.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top