సూర్యలంక బీచ్‌లో వీకెండ్‌ జోష్‌.. రాబడి కుష్‌

Suryalanka Beach: Resorts, Tourists, Income, Specialities - Sakshi

ఆహ్లాదానికి కేరాఫ్‌ సూర్యలంక

పర్యాటకం పరుగులు 6 నెలలుగా అధిక రాబడి

నెలకు సగటున రూ.40 లక్షల ఆదాయం 

హోరుగాలికి లయబద్ధంగా కేరింతలు కొడుతున్నట్టు ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. అలలతోపాటే ఎగిరెగిరి పడుతూ ఆనందగానం చేస్తున్నట్టు కిలకిలారావాలు చేసే వలస పక్షుల విన్యాసాలు.. ప్రకృతి సరికొత్త ‘అల’ంకారమేదో అద్దినట్టు.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మిలమిలా మెరుస్తూ కనువిందు చేసే సాగర జలాలు.. స్వచ్ఛమైన గాలి వీచే సుందర అటవీప్రాంతం.. ఇవన్నీ సూర్యలంక సొంతం. అందుకే ఈ తీరాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. వారాంతాల్లో అధికసంఖ్యలో పోటెత్తుతున్నారు.     

సాక్షి, బాపట్ల: వీకెండ్‌ వస్తే చాలు.. సూర్యలంక తీరం కోలాహలంగా మారుతోంది. శని, ఆదివారాల్లో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఫలితంగా పర్యాటక శాఖ ఆదాయం పెరుగుతోంది. రెండేళ్లుగా కరోనా వల్ల నష్టపోయిన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది.   

సూర్యలంక ప్రత్యేకతలివే..  
కాలుష్య కారక పరిశ్రమలు లేకపోవడం వల్ల ఈ తీరంలో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ రెండుకిలోమీటర్ల దూరం మడ అడవులు విస్తరించి ఉంటాయి. ఇవి పర్యాటకులకు స్వచ్ఛమైన గాలులతో స్వాగతం పలుకుతాయి. ఈ తీరంలో అడపాదడపా డాల్ఫిన్లు విన్యాసాలు చేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు.  

రవాణా మార్గం.. అనుకూలం  
బాపట్ల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే సూర్యలంక ఉంటుంది. రవాణా మార్గం అనువుగా ఉంటుంది. అందుకే రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్‌ వంటి సుదూర ప్రాంతాల నుంచీ యువత వారాంతంలో సూర్యలంకకు తరలివస్తారు. ఇక్కడ పర్యాటకులకు సకల వసతులూ అందుబాటులో ఉన్నాయి. బీచ్‌కు సమీపంలో ప్రైవేటు రిసార్ట్స్‌ ఉన్నాయి. బాపట్లలోని భావన్నారాయణ దేవాలయం, పొన్నూరులోని ఏకశిల శివాలయం ఈ తీరానికి ఆధ్యాత్మిక ఆకర్షణ.   

కలెక్టర్‌ చొరవతో..  
బాపట్ల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే విజయకృష్ణన్‌  సూర్యలంక తీరంపై దృష్టిపెట్టారు. ఈ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఎస్పీ వకుల్‌జిందాల్‌ సహకారంతో భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మద్యం సేవించి హల్‌చల్‌ చేసే మందుబాబులకు రూ.పదివేలు జరిమానా విధించాలని ఆదేశించారు.   

పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు  
సూర్యలంక తీరంలో పర్యాటకాభివృద్ధికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం కేటాయించిన 8 ఎకరాల భూమిలో ప్రైవేటు భాగస్వామ్యంతో నక్షత్ర హోటళ్లు, రిసార్ట్స్‌ నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకు కేటాయించిన భూముల్లోనూ ఇదే తరహా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ చైర్మన్‌ ఆరిమండ వరప్రసాదరెడ్డి చెప్పారు.  


పెరిగిన ఆదాయం

తీరంలో పర్యాటకశాఖ ఆదాయం పెరుగుతోంది. గతంలో నెలకు సగటున రూ.30 లక్షల మేర ఆదాయం వచ్చేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం రూ.40 లక్షలకు చేరుకుందని పేర్కొంటున్నారు. ఏడాదికి సుమారు రూ.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు వివరిస్తున్నారు. 32 రూమ్‌లతో సూర్యలంక తీరంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్స్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top