ఆ బియ్యం.. ఆరోగ్యానికి అభయం | Sakshi
Sakshi News home page

ఆ బియ్యం.. ఆరోగ్యానికి అభయం

Published Fri, Jan 21 2022 5:41 AM

Supply of fortified rice through public distribution system in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో చేపట్టిన పైలెట్‌ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదో నివేదిక ప్రకారం రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య విజయనగరం జిల్లాలో తాజాగా 78.7 నుంచి 66.7 శాతానికి తగ్గింది, మహిళల్లో రక్తహీనత 75.7 నుంచి 64.6 శాతానికి తగ్గడం గమనార్హం. సరైన పోషకాలు అందక సాధారణం కంటే తక్కువ బరువు ఉన్న మహిళల శాతం 25.8 నుంచి 16.9 శాతానికి తగ్గింది. 

ఆర్థిక భారం పడినా..
ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్టిఫికేషన్‌ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులకు(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) మాత్రమే ఈ రకమైన బియ్యాన్ని సరఫరా చేస్తుండగా మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో అందచేస్తోంది. ఎన్‌ఎఫ్‌ఎన్‌ఏలో కూడా కేంద్రం 75 శాతం కార్డులకు మాత్రమే అందిస్తోంది. మూడు జిల్లాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్రంపై నెలకు సుమారు రూ.1.70 కోట్లకుపైగా అదనపు భారం పడనుండగా ఏడాదికి రూ. 20.40 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. విశాఖపట్నం, కడప జిల్లాల్లో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య అధికంగా ఉన్నందున మొదటి దశలో అక్కడ ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. 

ఈ సీజన్‌లో 27 లక్షల టన్నుల లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది జూన్‌ నుంచి మధ్యాహ్నం భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు విటమిన్‌లతో కూడిన ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అందిస్తున్నారు. ఫలితంగా చాలా వరకు రక్తహీనత సమస్యలు తగ్గాయి. గత సీజన్‌లో (ఖరీఫ్, రబీ) 2.4 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని సేకరించారు. ప్రస్తుత సీజన్‌లో 27 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని మిల్లుల్లో ఫోర్టిఫైడ్‌ రైస్‌ను తయారు చేస్తున్నారు. 


ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్‌ అంటే?
బియ్యపు నూకలను పిండిగా చేసి ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌–బి 12 లాంటి కీలక సూక్ష్మ పోషకాలను జోడించి నీళ్లు పోసి ముద్దగా చేస్తారు. ఈ ముద్దను యంత్రంలో వేసి ఎక్స్‌ట్రాషన్‌ పద్ధతి ద్వారా బియ్యపు గింజలను తయారు చేస్తారు. ఈ కృత్రిమ బియ్యాన్ని ఆరబెట్టి ప్యాకింగ్‌ చేస్తారు. వీటినే ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్‌ అంటారు. ఇవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కిలో ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్‌ సేకరణకు ప్రభుత్వం రూ.75 చొప్పున ఖర్చు చేస్తోంది. వంద కిలోల సాధారణ బియ్యంలో ఒక కేజీ ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్‌ను కలిపి పంపిణీ చేస్తారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే చిన్నారుల్లో మెదడు, వెన్నెముక పెరుగుదలతో పాటు మహిళలకు రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌ సంస్థ  టెండర్లు నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ను కొనుగోలు చేస్తోంది.

దశలవారీగా అన్ని జిల్లాల్లో..
రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు ఫోర్టిఫైడ్‌ బియ్యం మంచి పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్‌ బి –12, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ లాంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. విజయనగరంలో చేపట్టిన పైలెట్‌ ప్రాజెక్టు మంచి ఫలితాలను ఇచ్చింది. దశలవారీగా అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని రేషన్‌ డిపోల ద్వారా ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం.
– గిరిజా శంకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌

పోషకాలతో కూడిన ఆహారం
పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కడప, విశాఖపట్నం జిల్లాల్లో వీటిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. చౌక బియ్యం ద్వారా సమకూరే పోషకాలపై ప్రజలకు అవగాహన  కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో త్వరలో విజయనగరం జిల్లాలో సర్వే నిర్వహిస్తాం. 
– వీరపాండియన్, పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ 

Advertisement
Advertisement