నకిలీ మందుల గుట్టు రట్టు

Supply of fake drugs in pursuit of antibiotics - Sakshi

యాంటీబయోటిక్స్‌ ముసుగులో డొల్ల మందులు సరఫరా

విజయవాడ, రాజమండ్రి, భీమవరం, పాలకొల్లులో విక్రయాలు

ఉత్తరాఖండ్‌ చిరునామాతో మందుల తయారీ.. 

ఆ చిరునామాలో ఆ కంపెనీ ఆనవాళ్లే లేని వైనం

మందులు సరఫరా చేసిన మెడికల్‌ ఏజెన్సీల ద్వారా విచారణ

ఉత్తరాఖండ్‌లో హెచ్‌పీహెచ్‌ఐఎన్‌ పేరుతో క్యాన్‌ కేర్‌ కంపెనీ తయారీ

ఏపీ ఔషధ నియంత్రణ శాఖ, పోలీసు బృందాలు ఆధారాల సేకరణ

29 మందిపై చార్జిషీటు.. చండీగఢ్‌లో నలుగురు జైలుకు 

సాక్షి, అమరావతి: యాంటీబయోటిక్స్‌ పేరుతో డొల్ల ట్యాబ్‌లెట్లు తయారు చేసి, దేశ వ్యాప్తంగా రోగులను మోసగిస్తున్న ముఠా బండారం బట్టబయలైంది. ఉత్తరాఖండ్‌ చిరునామాతో తయారైన ఈ నకిలీ మందులపై అనుమానం రావడంతో రాష్ట్రానికి చెందిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ మందులను తయారు చేసిన కంపెనీ చిరునామాను బట్టి ఆరాతీస్తే ఉత్తరాఖండ్‌లోని ఉద్దంసింగ్‌ నగర్‌లో అలాంటి కంపెనీ లేదని తేలింది. విజయవాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరంలలో ఈ నకిలీ మందులు బయటపడ్డాయి. దీంతో సుమారు 45 రోజుల పాటు పరిశోధించిన ఔషధ నియంత్రణ శాఖ అధికారుల బృందం ఎట్టకేలకు ఈ కుంభకోణాన్ని ఛేదించింది.  

నకిలీ మందుల గుట్టు బయట పడిందిలా..
హెచ్‌పీహెచ్‌ఐఎన్‌ కంపెనీ తయారీ పేరుతో కొన్ని మందులు తొలుత భీమవరంలోని మందుల దుకాణాలకు చేరాయి. తనిఖీల ద్వారా ఈ విషయం ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు తెలిసింది. వారు ఆ మాత్రలను ల్యాబ్‌కు పంపించారు. ఇందులో ఎలాంటి మందు లేదని తేలింది. ఆ తర్వాత విజయవాడలోని హరిప్రియ మెడికల్స్‌ ద్వారా రాజమండ్రిలోని లోకేశ్వరి ఫార్మసీ వాళ్లు ఎక్కువగా అజిత్రోమైసిన్, సిఫిగ్జిమ్‌ ట్యాబ్‌లెట్లు కొన్నారు. వీటిని పరిశీలిస్తే ఇవి కూడా డమ్మీ అని తేలింది. ఆ తర్వాత పాలకొల్లులోనూ ఇలాంటి నకిలీ మందులే దొరికాయి. గొల్లపూడిలోని సహస్ర మెడికల్స్‌లోనూ కొన్ని నకిలీ మందులు లభించాయి. ఇవి విష్‌ రెమిడీస్‌ సంస్థ తయారు చేసినట్టు తేలింది. దీంతో ఏపీ ఔషధ అధికారుల బృందం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది.

చండీగఢ్‌లో మూలాలు బయటకు..
హెచ్‌పీహెచ్‌ఐఎన్‌ అనే కంపెనీ లేకుండా మందులెలా వచ్చాయి.. వీటికి మూలాలెక్కడ? అని ఆరా తీస్తే చివరకు చండీగఢ్‌లో బయటపడ్డాయి. క్యాన్‌ కేర్‌ అనే ఫార్మాసూటికల్‌ సంస్థ వీటిని తయారు చేసినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో ఆ సంస్థను ప్రశ్నించారు. అయితే ఎక్కడా ఆ మందులు తయారు చేసినట్టు ఆధారాలు లభించలేదు. మరింత లోతుగా పరిశీలించగా, హెచ్‌పీహెచ్‌ఐఎన్‌ మందులు మార్కెట్‌ చేసినట్టు, దానికి జీఎస్‌టీ చెల్లించినట్టు ఆధారాలు లభించాయి. దీంతో దొంగలు దొరికిపోయారు. వీరిపై వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించి కేసులు నమోదు చేశారు. కోవిడ్‌ సమయంలో ఎలాంటి మందులు తయారు చేసినా అమ్మకాలు బాగా ఉంటాయనే ఉద్దేశంతో ఇలా సొమ్ము చేసుకోవాలనుకున్నారు. 

29 మందిపై చార్జిషీట్‌
నకిలీ మందులు తయారు చేసిన కంపెనీలు, వాటిని కొనుగోలు చేసిన ఇక్కడి ఫార్మసీ యాజమాన్యాలు మొత్తం 29 మందిపై చిర్జిషీట్‌ వేశారు. వీరిలో ఇప్పటికే చండీగఢ్‌లో నలుగురు జైలుకు వెళ్లారు. ఏపీలో నకిలీ మందులు కొనుగోలు చేసిన హరిప్రియ, కాళేశ్వరి ఫార్మసీ యాజమాన్యాల లైసెన్సులు రద్దు చేశారు. వీరిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇవ్వాలని కోర్టును కోరనున్నారు. దేశ వ్యాప్తంగా నకిలీ మందులు అమ్ముతున్న విషయం గురించి ఏపీ ఔషధ నియంత్రణ అధికారులు కేంద్ర ఔషధ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర సంస్థ అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఈ విచారణలో ఔషధ నియంత్రణకు చెందిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.రాజభాను, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌లు మల్లికార్జున రావు, వినోద్, అన్వేష్‌ రెడ్డి, ఎ.క్రిష్ణ, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ క్రిష్ణ, కానిస్టేబుల్‌ అచ్చన్నలు కీలక పాత్ర పోషించారు.  

తక్కువ కాలంలో ఛేదించగలిగాం
నకిలీ మందులు అమ్ముతున్నారన్నది ఫిర్యాదుల ద్వారా రాలేదు. మేమే గుర్తించాం. వెంటనే అప్రమత్తమయ్యాం. వాటి మూలాలన్నీ శోధిస్తూ 45 రోజుల్లోనే అతి పెద్ద కేసును ఛేదించగలిగాం. వీళ్లందరికీ కఠిన శిక్ష పడేలా చార్జిషీట్‌ రూపొందించాం. నకిలీ మందుల విచారణకు వేసిన బృందం అద్భుతంగా పని చేయడం వల్లే తొందరగా కేసును ఛేదించగలిగాం.
– రవిశంకర్‌ నారాయణ్, డైరెక్టర్‌ జనరల్, ఔషధ నియంత్రణశాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top