సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు

Sunkara Pavani Corrupted TDP: Corporators - Sakshi

పదవి కోసమే పావని కపట నాటకాలు

ఆ పార్టీ అసమ్మతి కార్పొరేటర్ల మండిపాటు

చంద్రబాబు, అచ్చెన్నాయుడులకు అనుకూల, అసమ్మతి వర్గాల లేఖ

సాక్షి, కాకినాడ: నియంతృత్వ ధోరణితో నగర మేయర్‌ సుంకర పావని టీడీపీని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆ పార్టీకి చెందిన అసమ్మతి కార్పొరేటర్లు మండిపడ్డారు. పదవి కోసం ఆమె ఆడుతున్న కపట నాటకాలను గుర్తించాలని పార్టీ అధినేతను కోరారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడులకు టీడీపీ అనుకూల, అసమ్మతి కార్పొరేటర్లు సోమవారం వేర్వేరుగా లేఖ పంపారు. నాలుగేళ్లుగా మేయర్‌ పావని, ఆమె భర్త తిరుమలకుమార్‌ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్ల పార్టీ ఎంతో నష్టపోయిందని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కొద్ది నెలల క్రితం అవిశ్వాస తీర్మానం పెడతారనే సమాచారంతో ఆమె ఎక్కని గడప, మొక్కని కాలు లేదంటూ మండిపడ్డారు.  చదవండి:  (బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు)

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖ నేతలను కలిసి, మిగిలిన ఏడాది కాలం తాను పదవిలో ఉండేలా చూడాలంటూ ప్రాధేయపడ్డారని తెలిపారు. ఇందుకు అధికార పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడం, అన్ని దారులూ మూసుకుపోవడంతో ఇప్పుడు సరికొత్త నాటకాలకు తెర తీశారని పేర్కొన్నారు. తన ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టారని, గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పొలిటికల్‌ డ్రామాలకు తెర లేపారని చంద్రబాబుకు రాసిన లేఖలో కార్పొరేటర్లు ప్రస్తావించారు. ఇంతకాలం పార్టీని భ్రష్టు పట్టించి, చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ పెద్దలను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు.

45వ డివిజన్‌ కార్పొరేటర్‌ కర్రి శైలజ కౌన్సిల్‌ సమావేశాలకు హాజరు కాకపోవడంపై మేయర్‌ సకాలంలో స్పందించలేదని, దీనివలన ఆమె తన పదవిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, చివరకు కోర్టును ఆశ్రయించి పదవిలో కొనసాగుతున్నారని వివరించారు. ఇలాంటి ఎన్నో తప్పిదాలు చేశారంటూ మేయర్‌ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. వీటితో పాటు నాలుగేళ్లుగా మేయర్‌ కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం, అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలను కూడా ఆ లేఖల్లో ప్రస్తావించారు. ఈ వాస్తవాలను, మేయర్‌ పాలనా విధానాన్ని, ఆమె హయాంలో కార్పొరేటర్లు, కార్యకర్తలు పడిన ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధినేతను కోరారు. మెజార్టీ కార్పొరేటర్లు పార్టీకి ఎందుకు దూరమయ్యారో వాస్తవాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.  చదవండి: (జనసేనలో భగ్గుమన్న విభేదాలు)

నేడో రేపో బాబుతో భేటీ 
టీడీపీలో ఉన్న కార్పొరేటర్లు మేయర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబుకు తమ వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ పక్షాన ఉన్న సుమారు 9 మంది కార్పొరేటర్లు చంద్రబాబును స్వయంగా కలిసి కాకినాడలో మేయర్‌ దంపతులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ వర్గాల సమాచారం. టీడీపీలో తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top