నిమ్మగడ్డ వ్యవహారశైలిపై మండిపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి

state election commissioner nimmagadda behaves like dictator says sajjala ramakrishna reddy - Sakshi

సాక్షి, తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన వ్యక్తి.. నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీనియర్ అధికారుల పట్ల ఆయన పరిధి దాటి చర్యలకు ఆదేశిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి వ్యక్తిగత అభిప్రాయాలు తగవని గుర్తు చేశారు. అసలు నిమ్మగడ్డ ఐఏఎస్‌ ఎలా అయ్యారో తెలీడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిమ్మగడ్డ నియంత్రణను కోల్పోయి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ద్వివేదిని చంద్రబాబు బెదిరించారని, అలా చేసినా.. గోపాలకృష్ణ ద్వివేది హుందాగా వ్యవహరించిన విషయాన్ని సజ్జల గర్తు చేశారు. టీఎన్ శేషన్‌ లాంటి వ్యక్తులు కూడా పరిధికి లోబడి వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. గతంలో ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారో కారణాలు చూపడం లేదని విమర్శించారు. ఎన్నికల విధుల నుంచి అధికారులనందరిని తప్పించి టీడీపీ గూండాలు, చంద్రబాబు ఏజెంట్లతో ఎన్నికలు నిర్వహిస్తారా అని నిమ్మగడ్డను నిలదీశారు. గతంలో ఏకగ్రీవాలపై నోరు మెదపని నిమ్మగడ్డ.. ఇప్పుడు అనవసర ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 2018లో ఆయన పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరపలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్న నిమ్మగడ్డ.. సీఎం, డీజీపీ, ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు ఇతర ఉద్యోగులపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై నమ్మకం లేని ఎస్‌ఈసీ.. ప్రభుత్వ యంత్రాంగం లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహించగలరని ప్రశ్నించారు. అసలు నిమ్మగడ్డ ఎన్నికలు జరుపుతున్న విధానమే సరైనది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top