
సాక్షి, తాడేపల్లి: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని చెప్పుకొచ్చారు వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని తెలిపారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు జరిగాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతా రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు అంటే ఒక ఉద్యోగిగా కాదు.. పిల్లల భవిష్యత్ తీర్చి దిద్దేవారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.
అందరి జీవితాల్లో వెలుగులు నింపగలిగిన శక్తి టీచర్లకే ఉంది. తల్లిదండ్రుల తర్వాత టీచర్లకే ప్రాధాన్యత. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండేలా విద్యాలయాలను తీర్చిదిద్దారు. పిల్లలను స్కూల్‌కి పంపటం తల్లిదండ్రులకు భారం కాకూడదని జగన్ ఆలోచించారు. పిల్లలకు మంచి చదువులు, సదుపాయాలు కల్పించారు. మంచి ఆహారం కోసం గోరుముద్ద కార్యక్రమాన్ని తెచ్చారు
విద్యార్థులకు ఇచ్చే బ్యాగ్, షూస్, పుస్తకాలతో సహా అన్నీ జగన్ చెక్ చేసేవారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జగన్ అంతగా ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లో ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. మెడికల్ కాలేజీలను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్‌కు తీసిపోకుండా నిర్మాణాలు చేపట్టారు. పేద, మధ్య తరగతి వారందరికీ మంచి వైద్యం అందాలని చూశారు. అలాంటి మెడికల్ కాలేజీలను నిర్వహించలేనప్పుడు ఇక ప్రభుత్వం ఎందుకు?.
కార్పొరేట్ చేతుల్లోకి విద్య, వైద్యం వెళ్తే పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడతాయి. ఆ ఆలోచనతోనే స్కూళ్లను రూపురేఖలు మార్చారు. కార్పొరేట్ స్కూళ్లు కూడా ప్రభుత్వ స్కూల్స్‌కు పోటీగా నిలిచాయి. ఇప్పుడు మళ్ళీ విద్యా వ్యవస్థ పతనం దిశగా వెళ్తోంది. వైఎస్ జగన్ విద్యారంగంపైనే అత్యధిక సమీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఓట్లు లేకపోయినా జగన్ రాజకీయం కోసం ఆలోచించలేదు. వారి భవిష్యత్తు బాగుండాలి కోరుకున్నారు. ఉపాధ్యాయులకు అత్యంత గౌరవం ఇచ్చారు
