సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి అరెస్ట్‌పై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలిని బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, నిందితుడు సివిల్ ఇంజినీర్ వెంకటరమణకు భారీగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉందని బాధితులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కేసు మలుపు తిరుగుతుందేమోనని భయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి విషయంలో కూడా జీజీహెచ్‌లో నిందితుడి కూతురు వైద్యురాలి ఉండటంతో పోస్టుమార్టం రిపోర్ట్ మార్పిడి ప్రయత్నాలపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్బంగా బాధితురాలి పేరెంట్స్ మాట్లాడుతూ..‘నా కూతురికి న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. నిందితుడికి ఉరి శిక్ష లేదా ఎన్‌కౌంటర్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.
జరిగింది ఇది.. శ్రీకాకుళం జిల్లాలో హిరమండలంలో ఓ గ్రామానికి చెందిన దంపతుల ఏకైక కుమార్తె(17) విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. స్థానికంగా సివిల్ ఇంజినీరుగా పని చేస్తున్న వెంకటరమణ.. ‘అమ్మాయికి పాఠాలు చెబుతాను.. నా వద్దకు పంపండి’ అని తల్లిదండ్రులను ఒప్పించాడు. కుమార్తె భవిష్యత్తు బాగుండాలని ఆశించిన వారు నమ్మకంతో అందుకు అంగీకరించారు. ఈ నెల 22న బాలికను శ్రీకాకుళం తీసుకురావాలని వెంకటరమణ సూచించడంతో తండ్రి స్వయంగా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తాను శ్రీకూర్మంలో ఉన్నానని.. ఇక్కడికి రావాలని వెంకటరమణ ఫోన్‌లో చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శ్రీకూర్మం వెళ్లారు. బాలికను అక్కడే ఉంచిన వెంకటరమణ.. తండ్రిని వెనక్కి పంపేశాడు.
అనంతరం, ఈ నెల 23న బాలికను విశాఖలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి పైశాచికంగా దాడి చేశాడు. ‘మీ కుమార్తె అనారోగ్యానికి గురైంది’ అంటూ 24న తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారికి బాలికను అప్పగించడంతో స్వస్థలానికి తీసుకెళ్లారు. అప్పటికీ ఆమె కొనఊపిరితో ఉన్నప్పటికీ... ‘మీ కుమార్తె చనిపోయింది. అందుకు నేనే కారణం. ఈ విషయం బయటకు చెప్పకుండా దహన సంస్కారాలు నిర్వహించండి. మీకు డబ్బు ఇస్తాను’ అని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు.
కొనఊపిరితో ఉన్న కుమార్తెను వారు శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి బుధవారం తీసుకొచ్చారు. ‘చదువు చెబుతానంటే నమ్మి పంపించాం. మా బిడ్డను చంపేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించండి. న్యాయం చేయండి’ అని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


