AP CM YS Jagan Attend For Vontimitta Sri Sita Rama Kalyanam Highlights, Details Inside - Sakshi
Sakshi News home page

Vontimitta: కమనీయం.. సీతారాముల కల్యాణం

Published Sat, Apr 16 2022 4:56 AM

Sri Ramulavari Kalyanam Vontimitta Amaravati - Sakshi

సాక్షి, ఒంటిమిట్ట: పండు వెన్నెల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కమనీయంగా, కనులపండువగా జరిగింది. వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయం సమీపంలో అత్యంత సుందరంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కల్యాణ వేదికలో ఈ వేడుక సాగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణోత్సవాన్ని ఆద్యంతం తిలకించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణాన్ని తిలకించి పులకించారు.

సాయంత్రం 5.48 గంటలకు విమానంలో కడప విమానాశ్రయానికి వచ్చిన సీఎం జగన్‌ రోడ్డుమార్గాన ఒంటిమిట్టకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రాత్రి 7.35 గంటలకు శ్రీకోదండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదపండితులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం 8.07 గంటలకు ముఖ్యమంత్రి శ్రీసీతారామస్వామి కల్యాణవేదిక వద్దకు చేరుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీతారాములకు సీఎం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ జగదభిరాముడి కల్యాణవేడుక వైభవంగా సాగింది.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం జరిపిస్తున్న పండితులు

9.28 గంటలకు మంగళసూత్రధారణ, 9.30 గంటలకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కల్యాణోత్సవం 9.40 గంటల వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. సుదూరం నుంచి కూడా కల్యాణాన్ని వీక్షించేందుకు టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ అందజేశారు. స్వామి కల్యాణోత్సవంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

కోదండరాముడికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు
శ్రీ కోదండరామయ్య కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల నుంచి సుమారు 400 గ్రాముల బరువున్న కిరీటాలు, పట్టువస్త్రాలు కానుకగా పంపారు. మూలమూర్తికి ఒకటి, ఉత్సవమూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టువస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. 

సీతారాములకు గవర్నర్‌ దంపతుల పట్టువస్త్రాలు
ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహించిన కల్యాణోత్సవంలో వధూవరులు సీతారాములకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సుప్రవ హరిచందన్‌ దంపతులు రాజ్‌భవన్‌ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. రాజ్‌భవన్‌ ఉప కార్యదర్శి విశ్వనాథ సన్యాసిరావు శుక్రవారం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆలయ అర్చకులకు అందజేశారు.

Advertisement
Advertisement