ఒంటిమిట్టలో మార్మోగిన రామనామ స్మరణ

Sri Ramanavami Celebrations At Vontimitta Kodanda Rama Temple - Sakshi

స్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి 

కోదండరాముడిని దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు, జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి 

శ్రీరాముడి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు 

ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్సార్‌ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామ­స్వామి ఆలయంలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా రామనామ స్మరణ మార్మోగింది. టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు ఆధ్వ­ర్యంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున­రెడ్డి సతీ­సమేతంగా శ్రీకోదండరామస్వామికి ప్రభుత్వ లాం­ఛనాలతో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే అంద­జేసిన ముత్యాల తలంబ్రాలను స్వామి కల్యాణ­వేదిక వద్ద తలంబ్రాలలో కలిపారు. అనంతరం స్వామి స్నపన తిరు­మంజనంలో ఎమ్మెల్యే మేడా దంప­తులు పాల్గొన్నారు.

రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి దంపతులు..  ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పెన్నా సిమెంట్స్‌ అధినేత వేణుగోపాల్‌రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకుని గర్భాలయంలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, అన్నప్రసాదం, క్యూలైన్ల వంటి ఏర్పాట్లు టీటీడీ చేసింది. 

శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఏకశిలానగరి (ఒంటిమిట్ట)లో శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శుక్రవారం ధ్వజారోహణ చేయనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top