శ్రీసిటీ టు.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

Sri city to Vande Bharat Express Andhra Pradesh - Sakshi

ఫైబర్‌ రీ ఇన్‌ ఫోర్స్‌ ప్లాస్టిక్‌ (ఎఫ్‌ఆర్‌పీ) విడి భాగాల సరఫరా 

దేశంలోని వివిధ మెట్రో ప్రాజెక్టులకూ శ్రీసిటీ నుంచే..

వరదయ్యపాళెం: వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచి శ్రీసిటీలోని బీఎఫ్‌జీ ఇండియా పరిశ్రమ నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్, దేశంలోని వివిధ మెట్రో ప్రాజెక్టులకు ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌ ప్లాస్టిక్‌ (ఎఫ్‌ఆర్‌పీ) విడి భాగాలను సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్‌ హయాంలో శ్రీసిటీలో తొలిసారిగా ఏర్పాటైన 8 పరిశ్రమల్లో బీఎఫ్‌జీ ఒకటి. బీఎఫ్‌జీ ఇంటర్నేషనల్‌ అనుబంధ సంస్థ అయిన బీఎఫ్‌జీ ఇండియా.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్, దేశంలోని వివిధ మెట్రో ప్రాజెక్టులకు నాణ్యమైన, ప్రపంచస్థాయి ఎఫ్‌ఆర్‌పీ విడి భాగాలను అందిస్తోంది.

శ్రీసిటీ సెజ్‌లో ఉన్న బీఎఫ్‌జీ ఇండియా 2009 నుంచి పవన శక్తి, నిర్మాణం, రవాణా వంటి వివిధ రంగాల్లో ఉన్న పరిశ్రమల కోసం ఎఫ్‌ఆర్‌పీ మిశ్రమ ఉత్పత్తులు, ప్రత్యేక ఆకృతుల నిర్మాణాలను తయారు చేస్తోంది. మెట్రోకోచ్‌ తయారీ సంస్థలు– ఆల్స్‌టం, బొంబార్డియర్, వోల్వో, ఇండియన్‌ రైల్వేస్‌కి చెందిన ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌), జనరల్‌ ఎలక్ట్రికల్‌–ఎనర్జీ, గమేశ, కొచ్చిన్‌ షిప్‌ యార్డ్, థెర్మాక్స్, ఆర్సీఎఫ్, ఎంసీఎఫ్, బెచ్‌టెల్‌ వంటి సంస్థలకు  బీఎఫ్‌జీ ఇండియా సేవలందిస్తోంది.  

329 రకాల ఎఫ్‌ఆర్‌పీ ప్యానెల్స్‌
వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్ట్‌లో రైలు పెట్టెలోని ఇంటీరియర్‌లు, టాయిలెట్‌ క్యాబిన్, ఇంజన్‌ ముందు భాగాన్ని బీఎఫ్‌జీ సంస్థే సరఫరా చేస్తోంది. ఇచ్చిన పనులను రికార్డు స్థాయిలో 10 నెలల్లో బీఎఫ్‌జీ పూర్తి చేసింది. ప్రాజెక్ట్‌ను ఆకర్షణీయంగా రూపొందించడానికి వివిధ రంగుల ప్యానెల్స్‌ను ఈ కంపెనీ తయారీ చేసింది. ఒక్కోరైలు కోసం 329 రకాల ఎఫ్‌ఆర్‌పీ ప్యానెల్స్‌ తయారయ్యాయ.

ఢిల్లీ మెట్రో రోలింగ్‌ స్టాక్‌(కోచెస్‌) కోసం బొంబార్డియర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌తో దాని వ్యూహాత్మక సరఫరాదారుగా ఇంటీరియర్స్, ఫ్రంట్‌ ఎండ్‌లు, డ్రైవర్‌ క్యాబ్‌లతో సహా ఎఫ్‌ఆర్‌పీ విడి భాగాలను బీఎఫ్‌జీ ఇండియా సరఫరా చేస్తోంది. చెన్నై, కొచ్చి, మెట్రో ప్రాజెక్ట్‌ల మెట్రో రోలింగ్‌ స్టాక్‌ కోసం సైడ్‌ వాల్స్, సెంట్రల్‌ సీలింగ్‌లు, లేటరల్‌ సీలింగ్‌లు, గ్యాంగ్‌వే విభజనలు, క్యాబ్‌ విభజనలతో సహా వివిధ భాగాలను శ్రీసిటీలోని ఆల్‌స్టోమ్‌ ఇండియాకు బీఎఫ్‌జీ సరఫరా చేస్తోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top