సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ జగన్ డిమాండ్
బాబూ జెన్‌జీ చూస్తోంది.. కాక్రోచ్‌లు కాటేస్తాయి
జెన్‌జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో ఎవరు ఎవర్నీ నియంత్రించలేరు
స్కామ్‌ల పాలసీతో బ్యాక్‌డోర్‌తో కావాల్సిన వారికి ఉద్యోగాలు
ఇందు కోసం 4, 47 నంబర్ల పేరిట కొత్త జీవోలు జారీ
డీఎస్సీ, టెట్ పరీక్ష లేకుండా, అసలు డిగ్రీ కూడా లేకుండానే టీచర్ ఉద్యోగాలు.. పతకాలు లేకపోయినా ఆటల్లో పాల్గొన్న 270 మందికి మాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ టీచర్ పోస్టులు
సాఫ్ట్‌బాల్ కోటాలో 38 మంది, జూడో కోటాలో 39 మంది టీచర్లుగా నియామకం.. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్
లోకేశ్ తోడల్లుడు, ఎంపీ భరత్ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్
వీళ్లే సరిఫికెట్ ఇచ్చి, ధ్రువీకరించి, వారే ఉద్యోగాలు ఇచ్చేశారు
నియామకాలు పూర్తవ్వగానే బాబు జారీ చేసిన జీవోలు రద్దు
1995 నుంచి చంద్రబాబు పరిపాలన అంతా లీకుల మయమే
డీఎస్సీ విద్యార్థుల న్యాయ పోరాటానికి వైఎస్సార్‌సీపీ మద్దతు
అధికారంలోకి రాగానే కమిషన్ వేసి అభ్యర్థులకు న్యాయం చేస్తాం
స్పోర్ట్స్ కోటా అన్నది పెద్ద కుంభకోణం. నిజంగా కష్టపడ్డ క్రీడాకారులకు అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష, టెట్ రాయాల్సిన అవసరం లేకుండా, బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. అనుకున్న వారితో పోస్టులు నింపాక, మళ్లీ పాలసీ మార్చారు.
స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకున్నారు. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా.. అదీ పతకాలు లేకపోయినా పర్వాలేదు.. పాల్గొంటే చాలంటూ ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనను మార్చారు. ఇందుకోసం జీవోల జారీకి ముందుగానే వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇవ్వడం దారుణం.
స్పోర్ట్స్‌లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్‌లోనూ పోస్టులు ఇచ్చేశారు. ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు. ఇలా బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
డీఎస్సీ స్కామ్‌కు సంబంధించి ఆధారాలు సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తోంది. పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే.. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణలో న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలాగని నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా కోట్ల మంది కాక్రోచ్‌లు వస్తారు. -వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : డీఎస్సీలో మోసపోయిన ప్రతి విద్యార్థి ఒక కాక్రోచ్ (బొద్దింక)గా మారి చంద్రబాబును కాటేస్తారని.. ఈ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా కాలంలో విద్యార్థులను ఎవరూ నియంత్రించలేరని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు దగాపడ్డ యువత కాక్రోచ్‌లై బాబును కాటేయడం ఖాయమని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా రూపంలో చంద్రబాబు సర్కారు డీఎస్సీలో భారీ స్కామ్ చేసిందని, దొడ్డిదారిన తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి జీవోల పేరిట స్కామ్‌కు స్కెచ్ వేశారని మండిపడ్డారు.

డీఎస్సీ పరీక్ష రాయకుండానే, ఎటువంటి డిగ్రీ అర్హత లేకుండానే.. ఆటల్లో ఎటువంటి ప్రతిభ కనపర్చకుండానే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ టీచర్లుగా చంద్రబాబు సర్కారు వందలాది మందిని నియమించేసిందని ఎత్తి చూపారు. జిల్లా, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా కేవలం పాల్గొన్నారని వీళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల చేత సర్టిఫికెట్లు ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆధార సహితంగా వివరించారు. ఇందుకోసం జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు.. నియామక ప్రక్రియ పూర్తికాగానే వాటిని రద్దు చేసి, కొత్త జీవోలు తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు.
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు పక్కా సాక్ష్యాలతో కనపడుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, మొత్తం డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం దిగిరాకపోతే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేసి మోసపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
నిజమైన క్రీడాకారులకు అన్యాయం
» ‘‘స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద కుంభకోణం. ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ క్రీడాకారుడికి కూడా అన్యాయం జరిగింది. జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లతో చంద్రబాబు, ఆయన కొడుకు ముందుగానే వేసిన ‘స్కామ్‌ల పాలసీ స్కెచ్’ ఇది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవ్వరూ డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, ఒక బ్యాక్ డోర్ పెట్టి.. దాని ద్వారా వారిని లోపలికి తీసుకున్నారు. దీనికోసం కొత్త జీవోలు తెచ్చారు. పని అయిపోయాక, అనుకున్న వారితో నింపాక, మళ్లీ పాలసీ మార్చారు. తెచ్చిన జీవోలను తీసేశారు.
» గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్‌మెంట్‌లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్ ఉంది. అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్‌లో మిగతా అభ్యర్థులతోపాటు వీరు కూడా ఎగ్జామ్స్ రాసి కచ్చితంగా క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండేది. అలాంటి నిబంధనను చంద్రబాబు మొత్తం మార్చేశారు.
» స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కు పెంచి బ్యాక్ డోర్ ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త జీవోలు నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చారు. గతంలో జీవో నంబర్ 74 ప్రకారం డీఎస్సీ తప్పకుండా ఉత్తీర్ణత కావాలి. ఈ నిబంధనను రద్దు చేస్తూ స్పోర్ట్స్ కోటా రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచారు. డీఎస్సీ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చేలా నిబంధనను మార్చారు.
» ఇంగ్లిష్, హిందీ, మాథ్స్, సోషల్ సైన్స్ సబ్జెక్టులకు డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలిచ్చారు. ఇందుకోసం జీవోలు జారీకి ముందుగానే వారి దగ్గర నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలు పెట్టారు. ఇంకా కొన్ని పోస్టులకు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన ఆటగాళ్ల ప్రతిభకు గౌరవం. దీన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా ఈ ప్రభుత్వం మార్చేసింది.



డీఎస్సీ 2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీ చేసిన జీవో నెం.23
క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్
స్పోర్ట్స్‌లో ఆటగాళ్ల ప్రతిభను చూడలేదు.. ఫలితాలు చూడలేదు.. బ్యాకప్ సర్టిఫికెట్స్ లేవు.. ఎటువంటి పతకాలు, సర్టిఫికెట్స్ లేకుండా కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏమిటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా), ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో పాల్గొంటే చాలు. అక్కడ కూడా మెడల్స్ అవసరం లేదు. కేవలం పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్స్‌తో పోస్టులు ఇచ్చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయా గేమ్స్‌లో పాల్లొన్నట్లు సర్టిఫికెట్స్ కూడా వాళ్లే ఇచ్చారు.
బాల్ బాడ్మింటన్‌లో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి, ఫెన్సింగ్‌లో 13 మందికి.. కేవలం ఆయా గేమ్స్‌లో పాల్గొన్నందుకే ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ నేత, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే వీళ్లే పాల్గొన్న వారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.. వీళ్లే ధ్రువీకరిస్తారు.
క్రీడల్లో పాల్గొంటే చాలు ఉద్యోగం
వివిధ కాలేజీల మధ్య ఆటల పోటీల్లో పాల్గొన్నందుకు 99 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో పతకాలు, ట్రోఫీలు రాని 86 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. వీళ్లకు పతకాలు రాలేదు, చెప్పకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు. జస్ట్ పార్టిసిపేట్ (పాల్గొన్నారు) చేశారంతే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆది కవి నన్నయ యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన వర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి 4, సంస్కృత యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీల నుంచి ఒక్కో సర్టిఫికెట్ ఉన్నాయి.
ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో.. అంటే వివిధ కాలేజీల మధ్య జరిగే పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకే 86 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు సంబంధించి 59 మందికి ఉద్యోగాలు వస్తే, అందులో పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా తరఫున ఆడితే చాలు.. గెలుపుతో సంబంధం లేకుండా, డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన వసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగం ఇచ్చేశారు.
నా పక్కనే ఉన్న (వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు) పోలవరానికి చెందిన గిరిజన క్రీడాకారుడు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనిగి దుర్గయ్యకు ఉద్యోగం రాలేదు. 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. డేటా అప్‌లోడ్‌లో సిల్వర్ మెడల్ అని రాయడంతో ఇవ్వలేదంటున్నారు. గోల్డ్ మెడల్ వచ్చినవాడు ఎవడైనా సిల్వర్ మెడల్ అని రాస్తాడా? అయినా ఆటల్లో పాల్గొంటేనే ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఇక్కడ ఏదో మెడల్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు? ఆయన 2002లో విశాఖ, హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్స్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, యూత్ స్పోర్ట్స్ కలకత్తాలో మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా ఉద్యోగం ఇవ్వలేదు.

అయినా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ ఆటల్లో పాల్గొంటేనే ఇస్తున్నావు కదా.. అదే జాతీయ స్థాయిలో పతకం సాధించినవాడికి ఎందుకు ఇవ్వలేదు? ఇదెక్కడి న్యాయం? నిజంగా ఇది కచ్చితమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా? ఇది క్రీడాకారుల పేరుతో చేస్తున్న స్కామ్ కాదా? ముందు తన వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 తీసుకొచ్చి గేట్లు తెరిచాడు. వాళ్ల వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చేశాక జీవో నంబర్ 23, జీవో 25, జీవో 56లతో పాత జీవోలను రద్దు చేస్తూ గేట్లు మూసేశారు. ఇదిస్కాం కాకపోతే ఏమిటి స్వామీ?
నీ బుద్ది పుట్టినప్పుడు జీవోలు ఇస్తున్నావు.. నీ బుద్ది పుట్టినట్లు జీవోలు రద్దు చేస్తున్నావు. ఇవి అంత మంచి జీవోలు అని నువ్వు అనుకున్నట్లయితే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47ని ఎందుకు రద్దు చేశావు చంద్రబాబూ? సెలక్టయిన అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే ఇంకో ఆశ్చర్చకరమైన విషయం కనిపిస్తోంది. ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీల్లో కేవలం పాల్గొన్నందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్లకు పతకాలు లేవు, చెప్పుకోదగ్గ టోర్నమెంట్స్‌లో పాల్గొనలేదు. కేవలం పార్టిసిపేట్ చేశారంతే.

ఒక్కో ఉద్యోగానికి రూ.15–20 లక్షలు
» స్పోర్ట్స్ కోటా పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు చేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి (ఆ వీడియో, ఆడియోను ప్రదర్శించారు). ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోను డీపీ (డిస్‌ప్లే పిక్చర్)గా పెట్టుకొని ఒక అభ్యర్థితో జరిగిన సంభాషణ కూడా బయట పడింది. విషయం బయటకు రాగానే నామమాత్రంగా కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్‌తో వదిలేశారు.
» ఇవన్నీ చూస్తుంటే స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగింది పారదర్శక నియామక ప్రక్రియ కాదు. ఇది ఒక వ్యవస్థీకృత స్కామ్ అని ప్రజలు భావిస్తున్నారు. ఆ కేసులో చేసిన విచారణ శూన్యం. ఏ విషయాలు కూడా బయటకు రాకుండా దాచిపెట్టారు. దీనికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ గమనించండి. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తల్చుకుంటే ఆ నంబర్ ఎవరిదో నిమిషాల్లో కనిపెట్టేస్తారు. కానీ, ఎఫ్‌ఐఆర్ కాపీలో ఆ నంబర్ ఎవరిదో చెప్పకుండా, పేరు కూడా తెలపకుండా అనుమానిత వ్యక్తి అని మాత్రమే రాశారు. ఆ అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. దీంతో ఆ కేసు ప్రక్రియ కూడా చాలా ఆలస్యం చేశారు.
» ఇలా ఎందుకు అయ్యిందంటే.. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల ఆలస్యం అయ్యిందంట. దీని అర్థం ఈ వీడియో కాల్ ఆషామాషీది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేలిపోతుంది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరో పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలే డీల్ చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకుండా, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది అన్నింటికంటే దారుణం.
కోట్లాది కాక్రోచ్‌ల్లో నేనూ ఒకడినవుతా...
కాక్రోచ్ పార్టీనా, ఇంకోటా అనేది పక్కన పెడితే.. వీళ్లంతా యువత. వీళ్లకు న్యాయం చేయకపోతే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీ ఇందులో భాగమే. వారి ఆశలను నువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపేస్తే ఆటోమేటిక్‌గా, కోట్ల మంది కాక్రోచ్‌లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా.
ఇది జెన్‌జెడ్ కాలం
» చంద్రబాబూ.. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది జెన్‌జెడ్, జెన్ ఆల్ఫా కాలం. దేన్నీ నువ్వు ఆపలేవు. నువ్వు ఆపేకొద్దీ ఇంతింతై, వటుడింతై అన్నట్లు పెరుగుతుంది. దగాపడ్డ యువత నిన్ను విడిచిపెట్టదు. నీకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు. కాక్రోచెస్ లేస్తాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేం సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి.
» విద్యా శాఖ మంత్రిగా సాక్షాత్తు చంద్రబాబు కొడుకు ఉన్నాడు కాబట్టి, ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు సరికదా, ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే వారం రోజుల క్రితం డీఎస్‌సీ అభ్యర్థులంతా నా వద్దకు వచ్చినప్పుడు వారికి ఒక్కటే చెప్పాను. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తానని. ఒకవేళ అప్పటికీ కాకపోతే, మేం అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి, రీ వెరిఫై చేసి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అని చెప్పా.

» రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దగాపడ్డ రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పిల్లలు.. ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కలుపుకొంటూ ప్రజల తరఫున నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కామ్‌లను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతాం. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతాం.
» ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించాలనో.. ఎవరినో ఎత్తిచూపాలనో కాదు. ప్రతి విషయంలో ఆధారాలతో సహా ఫ్యాక్ట్స్, ఫిగర్స్‌తో వివరించడం జరిగింది. ఇంత క్రిస్టల్ క్లియర్‌గా కన్పిస్తున్నప్పుడు సరైన సమాధానం చెప్పకపోగా, ఎదురుదాడి చేస్తూ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే కార్యక్రమం చేస్తే అది ఏరోజుకైనా దేవుడు, ప్రజలు హర్షించరు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీలో న్యాయం ఎలా జరుగుతుంది? పోలీసులు, అధికారులు వీళ్ల మనుషులే. సీఎం కుమారుడు నారా లోకేశ్ విద్యా శాఖ మంత్రి. అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థ దర్యాప్తుతోనే న్యాయం, ధర్మం జరుగుతుంది.


