నిజంగా ఈ నీలవేణిది చాలా పెద్ద మనసే

 Special Story On Sanitation Worker Neelaveni - Sakshi

ఆమె ఒక నిరుపేద పారుశుధ్య కార్మికురాలు.. భర్త, కుమారుడు మృతిచెందారు.. జీతం, భర్త పింఛనే బతుకుదెరువు.. అందులోనే కొంత నిరుపేదలకు పంచుతోంది.. అదీ సరిపోక చెత్తలో ఉండే సామగ్రిని అమ్మి సాయం చేస్తోంది... అనాథలను, నిరుపేదలను చదివించడమే తన లక్ష్యం అంటోంది.. నిజంగా ఈ తలపూరి నీలవేణిది పెద్ద మనసే..

సమస్యలు చుట్టుముట్టినా... 
విజయవాడ 57వ డివిజన్‌ సుబ్బరాజునగర్‌కి చెందిన నీలవేణి (44) కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య విభాగంలో కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త సాయిబాబు 2008లో గుండెపొటుతో మృతిచెందాడు. 2014లో కుమారుడు అనిల్‌కుమార్‌ ఫెర్రిలో స్నానం కోసమని కృష్ణా నదిలో దిగి మరణించాడు. అయినా ఆమె కృంగిపోలేదు. తనకు వచ్చే తక్కువ జీతంలోనే పేదలకు సాయం చేస్తూనే కుమార్తె నాగలక్ష్మీదుర్గకు పెళ్లి చేసింది. అనాథలకు, నిరుపేదలకు సాయం చేయడానికి తన జీతం డబ్బులతో పాటు భర్త మరణానంతరం వస్తోన్న పింఛన్‌ డబ్బులనూ ఉపయోగించేది. ఆ డబ్బులు సరిపోవడం లేదని భావించి తాను సేకరించిన చెత్తలో ప్లాస్టిక్, గాజు సీసాలు, పుస్తకాలు, ఇనుము వంటి సామాన్లు వేరుగా విక్రయించి ఆ డబ్బులు కూడా పేదలకు ఉపయోగించేది.

ట్రస్ట్‌ ఏర్పాటు... 
నీలవేణి చేస్తోన్న సాయాన్ని చూసిన కొందరు ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. తామూ సాయం చేస్తామని మరికొందరు ముందుకు వస్తున్నారు. వీరందరితో కలిసి నీలవేణి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానికంగా ఉంటున్న 8 మంది యువకులతో కలిసి 2020 జూలైలో ‘దివానపు తిరుపతి చారిటబుల్‌ ట్రస్ట్‌’ను ఏర్పాటు చేసి దానిద్వారా నిరుపేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, స్టేషనరీ సామాన్లు అందించడం, అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉన్నవారికి, రోడ్లపైన అనాథలకు భోజనాలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నిరుపేద కార్మిక కుటుంబాలను గుర్తించి వారికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్క్‌లు, మెడికల్‌ కిట్లు పంచిపెట్టింది. సమాజంలో ఒక మనిషి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే దానికి చదువు ఒక్కటే మార్గమని.. అనాథ పిల్లలు, నిరుపేద చిన్నారులను చదివించాలన్నదే తన లక్ష్యమని నీలవేణి వెల్లడించారు. 
– అజిత్‌సింగ్‌ నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top