సీఆర్‌డీఏలో ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రియల్ ఎస్టేట్ దందా
రాజధానికి భూసమీకరణ కింద భూములు ఇవ్వని రైతులకు బెదిరింపులు
ఎకరాకు రూ.50 లక్షలకు మించి దక్కదంటూ వేధింపులు
అంతకంటే ఎక్కువ ఇస్తా.. భూములు తనకే అమ్మేయాలంటూ బేరసారాలు
అలా అమ్మకానికి ఖరారైన భూములను రియల్టర్లకు విక్రయిస్తూ లాభార్జన
తన ద్వారా భూములు కొని, సమీకరణ కింద సీఆర్‌డీఏకు ఇచ్చిన రియల్టర్లకు వరాలు
ప్రధాన ప్రాంతాల్లో వారికి ప్లాట్లు కేటాయిస్తూ లంచాలు తీసుకుంటున్న వైనం
ఎస్‌డీసీ తీరుపై సీఆర్‌డీఏ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)లో భూసమీకరణ, భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌డీసీ) తీరుపై ఆ సంస్థలో పనిచేస్తున్న అధికారవర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన తీరును చూసి స్పెషల్ డిప్యూటీ కలెక్టరా? రియల్ ఎస్టేట్ బ్రోకరా అంటూ నివ్వెరపోతున్నాయి. తమ కడుపు కొట్టి ఇప్పటికే దాదాపు రూ.15 కోట్లు ఆ అధికారి వెనకేసుకున్నారని బాధిత రైతులు వాపోతున్నారు.
నోటిఫికేషన్‌ల ఆసరాగా అడుగులు
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 37,941.58 ఎకరాలు సమీకరించాల్సి ఉండగా ఇప్పటి వరకూ భూసమీకరణ పథకం కింద 35,017.89 ఎకరాలు సమీకరించారు. మరో 117.54 ఎకరాల భూమిని భూసేకరణ చట్టం–2013 కింద సేకరించారు. ఇంకా 2,806.15 ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉంది. ఆ భూమిని సీఆర్‌డీఏకు భూసమీకరణ కింద ఇచ్చేందుకు ఉండవల్లి, పెనుమాక, లింగాయపాలెం, నేలపాడు, మందడం, రాయపూడి తదితర గ్రామాల రైతులు అంగీకరించడం లేదు.
భూసమీకరణ కింద భూములు ఇవ్వకపోతే భూసేకరణ చట్టం–2013 కింద సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ భూములను సేకరించేందుకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌లు జారీ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ ఎస్‌డీసీ రియల్టీ దందా ప్రారంభించాడు. భూములు ఇవ్వని రైతుల ఇళ్ల వద్దకు సదరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వ్యక్తిగతంగా చాటుమాటుగా వెళ్తూ రూ.కోట్లు కూడబెట్టుకునే పన్నాగం పన్నాడు.
ఎస్‌డీసీ చాటుమాటు బేరసారాల క్రమమిది
మీ భూమిని భూసేకరణ చట్టం–2013 కింద బలవంతంగా సేకరించడానికి నోటిఫికేషన్ ఇస్తాం. దీని వల్ల ఎకరానికి పరిహారం రూ.50 లక్షలకు మించి రాదు.. ఆ భూమిని నాకు అమ్మండి... అంతకంటే ఎక్కువ ఇస్తాను.. అంటూ తొలుత బేరసారాలకు, బెదిరింపులకు దిగుతున్నాడు. రైతులతో భూమి ధరను ఖరారు చేసుకున్నాక.. వాటిని రియల్టర్లకు తాను ఆ రైతులతో ఖరారు చేసుకున్న ధర కంటే అధిక ధరకు విక్రయించి లాభం దండుకుంటున్నాడు.
మరోవైపు ఆ రియల్టర్ నుంచి 2 శాతం కమిషన్ కూడా తీసుకుంటున్నాడు. తన ద్వారా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి భూసమీకరణ కింద సీఆర్‌డీఏకు అప్పగించిన రియల్టర్లకు.. రాజధానిలో ప్రధాన ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తూ వారి వద్ద నుంచి లంచాలు మింగేస్తున్నాడు. కొండవీటివాగు వరద ముప్పు నివారణకు సీఆర్‌డీఏ చేపట్టిన పెనుమాక, శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్ కోసం తవి్వన మట్టిని టిప్పర్‌ల చొప్పున విక్రయిస్తూ ఇప్పటికే భారీ ఎత్తున దోచేస్తున్నారని చెబుతున్న రైతులు, ఇప్పుడిక అధికారులు రియల్టర్ల అవతారం కూడా ఎత్తడంపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


