మండుటెండల్లో చల్లని కబురు | Southwest monsoon entered Andhra Pradesh on June | Sakshi
Sakshi News home page

మండుటెండల్లో చల్లని కబురు

May 17 2026 5:42 AM | Updated on May 17 2026 5:42 AM

Southwest monsoon entered Andhra Pradesh on June

జూన్‌ మొదటి వారంలోనే ఏపీలోకి నైరుతి

ఇప్పటికే అండమాన్‌లోకి ప్రవేశం..26న కేరళను తాకే అవకాశం 

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం 

వచ్చే రెండ్రోజులు అక్కడక్కడా వర్షాలు

సాక్షి, అమరావతి: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం అండమాన్‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఈ నెల 26 నాటికి కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా కేరళకు వచ్చిన వా­రం, పది రోజుల్లో ఇవి మన రాష్ట్రాన్ని తాకుతాయి కాబట్టి జూన్‌ మొదటి వారంలో రుతుపవనాలు ఏపీలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అండమాన్‌లో ఉన్న రుతుపవనాలు మూడు, నాలుగు రోజుల్లో అరేబియా సముద్రం, అండమాన్‌ సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు వా­తావరణం అనుకూలంగా ఉంది.  

రెండ్రోజులు తేలికపాటి వర్షాలు 
కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగు­తోంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండగా, తమిళనాడు కోస్తా ప్రాంతంలో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం ఇందులో కలిసిపోయింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

పెరిగిన ఎండల తీవ్రత 
మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా నగరడోనలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా బెల్లంకొండలో 42.6, నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురంలో 42.5, ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి, పశి్చమ గోదావరి జిల్లా పెనుగొండలో 41.9, వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరులో 41.6, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 41.2, పోలవరం జిల్లా చింతూరులో 41.1, అనంతపురం జిల్లా పాతకొత్తచెరువులో 41 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 కర్నూలు జిల్లాలో 12 మండలాలు, నంద్యాల జిల్లాలో 10, కడప జిల్లాలో 6 మండలాలు కలుపుకొని మొత్తంగా 9 జిల్లాల పరిధిలోని 41 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement