సర్ప సంరక్షకుడు క్రాంతి

Snake Savior Society Kranti Special Story In West Godavari - Sakshi

పాము కనపడగానే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో దానిని చంపేయాలని చూస్తాం. మరోవైపు పాము కాటుకు అనేక మంది మృత్యువాత పడుతుండటం  చూస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి అనే యువకుడికి పాము నుంచి మనిషికి, మనిషి నుంచి పాముకు రక్షణ కల్పించాలనే ఆలోచన కలిగింది. దీంతో అతను స్నేక్‌ సేవియర్‌గా మారాడు.

జంగారెడ్డిగూడెం‌: క్రాంతి జనావాసాల మధ్యకు వచ్చిన వేలల్లో పాములను పట్టుకుని రక్షించాడు. ఇతను స్నేక్‌ సేవియర్స్‌ సొసైటీ స్థాపించి నాలుగేళ్లు పూర్తయింది. క్రాంతి ప్రస్థానాన్ని చూస్తే.. పేరంపేటకు చెందిన కూలీలైన చదలవాడ రాజారావు, వెంకాయమ్మ దంపతుల కుమారుడు క్రాంతికుమార్‌. తల్లితండ్రుల అండతో అతను బీఎస్సీ పూర్తిచేశాడు. చిన్ననాటి నుంచి వన్య ప్రాణులపై మక్కువ ఎక్కువ. దీంతో 2008లో పాములను పట్టుకోవటంలో శిక్షణ పొందాడు. శిక్షణ అనంతరం విశాఖపట్టణంలోని స్నేక్‌ సేవియర్స్‌ సొసైటీలో పాములపై పరిశోధన చేశాడు. అతి తక్కువ కాలంలోనే పాములను సురక్షితంగా పట్టుకోవడంలో అనుభవం గడించాడు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా ప్రజలు వారి ప్రాణాలు ఎలా రక్షించుకోవచ్చనే విషయంపై అనేక గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాడు. 2016 డిసెంబర్‌ 30న స్నేక్‌ సేవియర్స్‌ సొసైటీని క్రాంతి స్థాపించారు.

ఇప్పటివరకు అతను జనావాసాలు, ఇళ్లలోకి వచ్చిన 10,900 పాములను పట్టుకుని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. జిల్లాలో అనేక మండలాల్లో ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాము కనిపిస్తే గుర్తుకొచ్చేది క్రాంతి పేరు. ఫోన్‌ చేయగానే ఆ ప్రాంతానికి వెళ్లి పామును పట్టుకుని  అటవీ శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమక్షంలో అటవీ ప్రాంతాల్లో విడిచి పెడుతుంటాడు. దూర ప్రాంతాలకు పాములను పట్టేందుకు సొంత ఖర్చులతో వెళుతుంటాడు. పామును పట్టినందుకు ఫోన్‌ చేసిన వ్యక్తులు ఖర్చులకు డబ్బులు ఇస్తే తీసుకుంటాడేగానీ డిమాండ్‌ మాత్రం చేయడు. క్రాంతి చేస్తున్న ఈ పనికి ప్రజలతోపాటు అటవీశాఖాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. స్నేక్‌ సేవియర్స్‌ సొసైటీ వార్షికోత్సవంలో భాగంగా పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతున్నాడు క్రాంతి.

కార్యాలయానికి స్థలం కేటాయించండి
ఆర్థిక వనరుల విషయంలో స్నేక్‌ సేవియర్స్‌ సొసైటీకి ఇబ్బందులున్నా అధిగమిస్తూనే ఇంతకాలం సంస్థను ముందుకు తీసుకెళుతున్నాం. ప్రభుత్వ సహకారం ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందించటానికి సిద్ధంగా ఉన్నా. స్నేక్‌ సేవియర్స్‌ సొసైటీ కార్యాలయ భవనానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నా. కార్యాలయం ఏర్పడితే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. స్టాల్స్‌ ఏర్పాటు చేస్తాం. పాము కనిపిస్తే 83869 84869, 80998 55153 నంబర్లకు ఫోన్‌ చేయండి. – చదలవాడ క్రాంతి, డైరెక్టర్, స్నేక్‌ సేవియర్స్‌ సొసైటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top