
అనంతపురం జిల్లా: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో వసతులు కరువయ్యాయి. ఉన్నది ఒకటే గది... అది కూడా చిన్నదిగా ఉండడంతో అవస్థలు తప్పడం లేదు. వాహనాల్లోనే గంటల తరబడి మృతదేహాలను ఉంచాల్సిన దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే తమ వాళ్లు పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబీకులు, బంధువులు.. ఈ దుస్థితితో మరింతగా కన్నీళ్లు పెడుతున్నారు. సోమవారం రాయదుర్గం ఏరియా ఆస్పత్రికి ఒకేసారి ఐదు మృతదేహాలను తీసుకురాగా మార్చురీలో ఖాళీ లేక వాహనాల్లోనే సుమారు 8 గంటల పాటు ఉంచాల్సి వచ్చింది. మార్చురీ వద్ద కనీసం కూర్చునేందుకు కూడా ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో మృతుల కుటుంబీకులు, బంధువులు ఎండలోనే అవస్థలు పడుతూ నిరీక్షించారు.
పేరుకే అప్‌గ్రేడ్ ఆస్పత్రి..
కర్ణాటక సరిహద్దున ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో క్రైమ్ రేట్ ఎక్కువ. రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతుంటాయి. కణేకల్లు మినహా మిగిలిన నాలుగు మండలాల్లో ఎక్కడా శవపరీక్ష నిర్వహించే గది లేకపోవడంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎక్కువగా రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తుంటారు. ఇక్కడేమో తగిన వసతుల్లేక బాధిత కుటుంబీకుల వేదన వర్ణనాతీతంగా ఉంటోంది. రాయదుర్గం పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మనహాళ్, డీ హీరేహాళ్ మండలాల నుంచి మృతదేహాలను తీసుకొచ్చినప్పుడు వారు పడే అవస్థలు చెప్పనలవిగా ఉంటున్నాయి. పేరుకే అప్‌గ్రేడ్ ఆస్పత్రి అయినా ఆ మేరకు వసతులు లేకపోవడంపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి ఆస్పత్రి ప్రాంగణంలో అదనంగా మార్చురీ గదులు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
మార్చురీ గది చిన్నదిగా ఉండడంతో శవ పరీక్షల కోసం ఇబ్బందిగా మారింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అదనపు గది నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తాం. వైదులు, సిబ్బంది నుంచి ఎక్కడా ఆలస్యం లేకుండా పోస్టుమార్టం పూర్తి చేసి పంపుతాం.
– మెర్జీ జ్ఞానసుధ, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, రాయదుర్గం