breaking news
rayadurgam constituency
-
అనంతపురం: బీజేపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్త హత్య చేశాడు. బొమ్మనహాల్ మండలం చంద్రగిరిలో ఘటన జరిగింది. ఇంట్లో భోజనం చేస్తున్న కృష్ణమూర్తి శెట్టి (50) పై వేటకొడళ్లతో దాడి చేశాడు.స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టి చెల్లెలు పుష్పావతితో కలిసి ఉండేవాడు. రాత్రి ఆయన ఇంట్లో చెల్లెలితో కలిసి భోజనం చేస్తుండగా టీడీపీ కార్యకర్త వేటకొడవలితో చెయ్యి, వీపు, తలపై దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించి చెల్లెలు భయంతో బయటకు వచ్చి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.కొన ఊపిరితో ఉన్న క్రిష్ణమూర్తి శెట్టిని 108లో బళ్లారి విమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బొమ్మనహాళ్ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా మండలంలోని కురువల్లికి చెందిన ఓ వ్యక్తితో భూమి తగాదాలతోనే ఈ హత్యాయత్నం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. -
36 నామినేషన్ల తిరస్కరణ
ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో 36 నామినేషన్లు తిరస్కరించారు. సోమవారం కలెక్టర్ లోకేష్‌కుమార్ చాంబర్లో అనంతపురం లోక్‌సభ స్థానాల నామినేషన్లు, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ చాంబర్లో హిందూపురం లోక్‌సభ స్థానాల నామినేషన్ల పరిశీలన చేపట్టారు. అసెంబ్లీ నామినేషన్ల పరిశీలనను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల చాంబర్లలో చేపట్టారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి దాఖలైన 17 నామినేషన్లలో ధ్రువీకరణ పత్రాలు జత చేయకపోవడంతో 3 నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన 14 నామినేషన్లను ఆమోదించారు. హిందూపురం లోక్‌సభ స్థానానికి దాఖలైన 14 నామినేషన్లూ సక్రమంగా ఉన్నట్లు తేల్చారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 266 నామినేషన్న్లు రాగా అధికారుల పరిశీలనలో 33 తిరస్కరణకు గురయ్యాయి. 233 నామినేషన్లను ఆమోదించారు. ప్రధాన పార్టీల నామినేషన్లన్నీ ఆమోదం పొందాయి. పలువురు స్వతంత్ర, డమ్మీ అభ్యర్థులుగా వేసిన నామినేషన్లు తిరస్కరించారు. శింగనమలలో అత్యధికంగా 9 నామినేషన్లు తిరస్కరించారు. అనంతపురం అర్బన్, మడకశిర, రాయదుర్గం నియోజకవర్గంలో దాఖలైన నామినేషన్లన్నీ ఆమోదం పొందాయి. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రస్తుతం ఆమోదం తెలిపిన వాటిలో రెబల్స్, ఇతర అభ్యర్థులు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటిస్తారు.