
సీఎం చంద్రబాబు నివాసం పక్కనే భారీ కుంభకోణం
రోజుకు సుమారు రూ.4 కోట్లు.. నెలకు రూ.100–120 కోట్లు జేబులోకి
ఐదు నెలల్లో ఏకంగా రూ.580 కోట్లు దోపిడీ
పైకి మాత్రమే పూడిక తీత.. చేసేదంతా ఇసుక మేత
కృష్ణా నది నావిగేషన్ చానల్ ముసుగులో భారీ అక్రమం
ఇసుక అక్రమ రవాణా కోసమే బల్లకట్టు దారి పనులు
అర్హత లేకున్నా చినబాబు అనుయాయుల కంపెనీకి కాంట్రాక్టు
అనుమతి పొందింది కేవలం 7 లక్షల క్యూబిక్ మీటర్లకే..
ఇప్పటికే ఆ 7లక్షలకు అదనంగా 8 లక్షల క్యూబిక్ మీటర్లు తోడివేత
హైదరాబాద్, ఇతర నగరాలకు అక్రమ రవాణా
కాంట్రాక్టు టన్నుకు రూ.215... ఖర్చయ్యేది రూ.65 మాత్రమే
టన్నుకు రూ.150 చొప్పున కాంట్రాక్టు సంస్థ జేబులోకి..
ఓవైపు అక్రమ రవాణా, మరోవైపు టన్నుకు అప్పనంగా అదనపు సొమ్ము
ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ డ్రెడ్జింగ్ పనులూ చినబాబు అనుయాయులకే
ఓచేత్తో ఉచిత ఇసుక అంటూ ప్రజలను మాయ చేస్తూ... మరోచేత్తో భారీ దందాను ప్రోత్సహిస్తూ జేబులు నింపుకొంటున్నారు పెదబాబు, చినబాబు. అర్హత లేని సంస్థను అడ్డుపెట్టుకుని.. అనుమతుల్లేని తవ్వకాలతో రోజుకు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఈ దోపిడీతో కృష్ణా నదీ గర్భం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ఇదంతా సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో బల్లకట్టు నావిగేషన్ చానల్ ముసుగులో సాగుతున్న భారీ దందా.
సాక్షి, అమరావతి: పెదబాబు, చినబాబు అండదండలే అర్హతగా... కృష్ణా నదిలో బల్లకట్టు నావిగేషన్ చానల్ పూడికతీత పనుల కాంట్రాక్టు చేజిక్కించుకుంది కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ. ఇది పైకి మాత్రమే. చేస్తున్నది మాత్రం నిత్యం వేలాది టన్నుల ఇసుక అక్రమ తవ్వకం.. తరలింపు. రాజధాని పనులకు ఇసుక, నావిగేషన్ చానల్ పేరిట అడ్డగోలుగా తవ్వి రోజుకు దాదాపు రూ.4 కోట్లు మింగేస్తోంది.
⇒ కృష్ణా నది మీదుగా గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాకపోకలకు ఇబ్రహీంపట్నం–వైకుంఠపురం మధ్య బల్లకట్టు దారి ఉంది. దీనిలో ఇసుక మేటలను తొలగించేందుకు కృష్ణా, గోదావరి వాటర్ వేస్ సంస్థ డిసెంబరులో కాంట్రాక్టు పొందింది. ఇసుక తవ్వకంలో ఎలాంటి అర్హత లేకున్నా కేవలం చినబాబు సన్నిహితులంతా కలిసి దీనికి కాంట్రాక్టు ఇప్పించారు. తాము చెప్పినట్టల్లా సంతకం పెట్టే ఇరిగేషన్ అధికారిని గుంటూరు జిల్లాలో నియమించి అనుమతులు తీసుకున్నారు.
నావిగేషన్ చానల్ పరిధిలో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీయాలనేది కాంట్రాక్టు. టన్నుకు రూ.215 చొప్పున చెల్లిస్తోంది. వాస్తవానికి టన్ను ఇసుక తవ్వేందుకు రూ.50, లోడింగ్‌కు రూ.15 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, అంతా సొంతవాళ్లే కావడంతో ప్రభుత్వ పెద్దలు అదనంగా రూ.150 కలిపి కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. దీంట్లోనే.. కాంట్రాక్టు సంస్థకు నిర్దేశిత 7 లక్షల టన్నులకు రూ.10.5 కోట్లు అప్పనంగా ఇచ్చినట్లయింది.
⇒ ఇప్పటికే 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేసినట్లు స్థానిక బోట్స్‌మెన్ సంఘాలు చెబుతున్నాయి. రాజధాని పనుల కోసమని చెబుతూ రోజుకు 30 వేల టన్నుల ఇసుకను తోడుతున్నారు. ఇందులో సగానికి పైగా హైదరాబాద్, తదితర నగరాలు, పట్టణాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి రాజధాని పనుల కాంట్రాక్టు సంస్థలకు టన్ను రూ.130కే ఇసుక సరఫరా చేయాలని మొదట ఒప్పుకొన్నారు. కానీ, కాంట్రాక్టు రూ.215కు తీసుకున్నాం కాబట్టి అంతే ఇవ్వాలని వసూలు చేస్తున్నారు.
ఇందులోనూ టన్నుకు రూ.85 మిగుల్చుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌కు తరలించే ఇసుకను టన్ను రూ.2,500తో అమ్ముతున్నారు. మొత్తంగా రోజుకు 30 వేల టన్నుల మీద సుమారు రూ.4 కోట్లు.. నెలకు రూ.100–120 కోట్లు అక్రమంగా అర్జిస్తున్నారు. ఈ లెక్కన మార్చి నుంచి ఇప్పటి వరకు.. అంటే ఐదు నెలల్లో రూ.580 కోట్లకు పైగా దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దందా చూస్తుంటే... బల్లకట్టు కోసం కానే కాదు.. చినబాబు మూటల కోసమేనని స్పష్టమవుతోంది.
అంతా ఆ తాను ముక్కలే...
కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ తాతినేని వంశీది
చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ కీలక పాత్ర
అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న కీలక అనుయాయుడు కేఆర్
కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ తాతినేని వంశీ అనే వ్యక్తికి చెందినది. కరకట్టపైనే నివాసం ఉండే, చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎన్‌ఆర్‌ఐ డాక్టర్, మరికొందరు కలిసి దీన్ని నడిపిస్తున్నారు. వీరికి చినబాబు తరఫున ప్రతినిధిగా ఆయన కీలక అనుయాయుడు కేఆర్ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. అందరూ ముఠాగా ఏర్పడి ఇసుక అక్రమ తవ్వకాలతో రూ.కోట్లు దండుకుంటున్నారు.
ఇది చాలదన్నట్లు ప్రకాశం బ్యారేజీ పూడికతీత పనుల్లోనూ రెట్టింపు మొత్తం దండుకునేందుకు స్కెచ్ వేశారు. రాజధాని పనులు చేస్తున్న బడా కంపెనీల తరఫున ఇదే కంపెనీతో టెండర్లు వేయించి, దాన్ని కూడా సిండికేట్‌గా దక్కించుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా త్వరలో రూ.286 కోట్ల విలువతో టెండర్ పిలిచేందుకు సీఆర్‌డీఏ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కాంట్రాక్టు కూడా కృష్ణా–గోదావరి వాటర్ వేస్‌కు ఇచ్చేలా చినబాబు స్కెచ్ వేశారు. అందుకుతగ్గట్టుగానే టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అర్హత, అనుభవం లేని సంస్థకు కట్టబెట్టేసి...
చినబాబు జేబు సంస్థకు అడ్డగోలుగా అనుమతులు
లారీలు ఆపితే పేషీ నుంచి వెంటనే ఫోన్లు
అడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకి
గత ప్రభుత్వంలో పక్కనపెట్టినా.. కూటమి వచ్చాక పచ్చజెండా
కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థకు ఇసుక తవ్వే అర్హతలు ఏమాత్రం లేవని బోట్స్‌మెన్ సంఘాలు చెబుతున్నాయి. డ్రెడ్జింగ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించేలా ఉందని వాపోతున్నాయి. తమ ఉపాధి పోతోందని, నదీ గర్భం కుంగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకునేవారే లేరని బోట్స్‌మెన్ సంఘాల వారు వాపోతున్నారు.
వాస్తవానికి డ్రెడ్జింగ్‌కు అవసరమైన రిజిస్ట్రేషన్లు, బోట్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, సరంగు లైసెన్స్‌లతో పాటు ఇతర చట్టపరమైన అర్హతలు ఏవీ లేవని తేలడంతో గత ప్రభుత్వంలో ఈ సంస్థకు ఏ పనీ ఇవ్వలేదు. ఇప్పుడు చినబాబు బినామీగా మారడంతో కాంట్రాక్టులు సులభంగా వచ్చేస్తున్నాయి. పేరు ఆ కంపెనీదైనా వ్యవహారాలన్నీ చినబాబు మనుషులే చూసుకుంటున్నారు.
అడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకి దిగి సర్దుబాటు చేస్తున్నారు. కంపెనీ లారీలు, వ్యవహారాలను ఎవరైనా ఆపితే వెంటనే చినబాబు పేషీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. నావిగేషన్ చానల్, డ్రెడ్జింగ్ పేరుతో తమ ఇంటి పక్క నుంచే రూ.కోట్లు కురిపించే ఇసుక చానల్‌ను పెదబాబు, చినబాబు తయారు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.