నా కొడుకు ఇక లేడయ్యా.. | Sai Krishna Mother Crying Infront Of Ys Jagan | Sakshi
Sakshi News home page

నా కొడుకు ఇక లేడయ్యా..

Jun 19 2026 5:07 AM | Updated on Jun 19 2026 7:32 AM

Sai Krishna Mother Crying Infront Of Ys Jagan

గాదె సాయికృష్ణ తల్లిని ఓదార్చుతున్న వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌ ఎదుట కన్నీటి పర్యంతం అయిన సాయికృష్ణ తల్లి

ఏడెనిమిది మంది కొట్టేంత తప్పు ఏం చేశాడయ్యా..

పోలీసులు కొడుతుంటే మా అబ్బాయి అరుపులు వినిపించాయి

స్టేషన్‌కు ఎన్నిమార్లు వెళ్లినా సమాధానం చెప్పలేదు

ఓ రోజు నీ కొడుకును చంపేశామని చెప్పారు

ఫొటో చేయించి దండేసుకోమని సీఐ హేళన చేశాడు

శవం లేకపోతే నాబిడ్డ బూడిదైనా ఇవ్వమని వేడుకుంటున్నా

సాయికృష్ణను హింసించడం కళ్లారా చూశానని ప్రత్యక్ష సాక్షి మహంకాళి వెల్లడి

సాక్షి, అమరావతి: పోలీసులు మా అబ్బాయిని కొడుతుంటే ఆ అరుపులు వినిపించాయి. ఏడెని­మిది మంది కొట్టి.. చంపేసేంతటి తప్పు ఏంచేశాడయ్యా.. పోలీసులు అన్యాయంగా మా పిల్లా­డిని పొట్టన పెట్టుకున్నారయ్యా..’ అంటూ లాకప్‌­డెత్‌ అయిన సాయికృష్ణ తల్లి కన్నీటి  పర్యంతమైంది. గురువారం సాయంత్రం సాయికృష్ణ తల్లిని, కుటుంబ సభ్యులను విజయవాడ కృష్ణలంకలోని వారి నివాసంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీరు మున్నీరు అవుతూ, బొంగురు పోయిన కంఠంతో, తన కొడుకును ఏవిధంగా పోలీసులు కొట్టి చంపారో పూసగుచ్చినట్లు వివరించారు.

ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను తీసుకొచ్చారు. అక్కడ స్టేషన్‌లో ఉంచారని కొంత మంది కుర్రాళ్లు చెబితే అక్కడి వెళ్లి, మా కొడును చూపండయ్యా అని వేడుకున్నాను. అక్కడ కాని­స్టేబుల్‌ ఓ సమాధానం, ఎస్సై మరో సమాధానం ఇచ్చారు. పైన ఉన్నాడని, రేపు ఇంటికి పంపుతామని చెప్పారు. ఆ తర్వాత పలుమార్లు ఎండలో స్టేషన్‌ చుట్టూ తిరిగాను. స్టేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న యువకులు సైగలు చేశారు. కానీ నాకు సరిగా కనిపించలేదు. మా అబ్బాయి అరుపులు వినిపించాయి.

పైకి వెళ్లబోతే పోలీసులు అడ్డుకు­న్నారు. అక్కడ లాకప్‌లో ఉన్న వారు మావాడిని ఏవిధంగా కొట్టింది చెప్పారు. కాళ్ల గోళ్లు పీకేసి, ఆర్‌ఎంపీ డాక్టర్‌తో కట్టు కట్టించారని, కాళ్లకు ఇంజక్షన్‌లు వేయడంతో కాళ్లు పని చేయకుండా పోయా­యని తెలిపారు. మెడలు విరిచారని చెప్పారు. అమ్మను చూపించండని వేడుకొంటున్నా కనికరించకుండా బలవంతంగా ఇద్దరు కానిస్టేబుళ్లు పిల్లా­డిని ఈడ్చుకొని వెళ్లి రూంలో పడేశారు. ఆ తర్వాత సాయికృష్ణ గురించి అడిగితే పోలీసులు సమాధా­నం చెప్పలేదు. చివరకు డౌట్‌ వచ్చి డీజీపీకి ఫిర్యాదు చేశాం.

ఆ ఫిర్యాదు సీపీ వద్దకు వచ్చింది. అప్పుడు పోలీసులు వచ్చి అయిందేదో అయ్యింది.. రాజీ చేసుకుందామని దూతలను పంపారు. ఆ దూత తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అమ్మిశెట్టి వాసు. దీంతో మాకు పూర్తి డౌట్‌ వచ్చింది. జూన్‌ 2వ తేదిన హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశాం. నాకు ఏమీ వద్దయ్యా.. నా కొడు­కును చంపిన వారందరినీ శిక్షించాలి. ఒక్కగానొక్క కొడుకును ఏడెనిమిది మంది కొట్టి చంపేంత తప్పు ఏమి చేశాడు? శవం లేకపోతే కనీసం బూడిదైనా ఇప్పించండని అడిగినా పట్టించుకోలేదు. సీఐ నాగ­రాజు మా కుమారుడిని చంపేస్తానని ముందే చెప్పాడు. అన్నంత పనీ చేశాడు. ఫొటో చేయించి దండేసుకో అని హేళనగా మాట్లాడాడు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. తాము అన్ని విధాల అండగా ఉంటామని ఆ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.  

ఇంకా చాలా మంది ఉన్నారు.. 
ఈ ఘటన గురించి సాయికృష్ణ మేనమామలు ముళ్లపూడి నవరంగ్, నాగేశ్వరరావు, సోదరి విజయ­లక్ష్మి, న్యాయవాది అయిన పినతల్లి కనకదుర్గ జగన్‌కు వివరించారు. ‘సాయికృష్ణ లాంటి వారు సీఐ నాగరాజు చేతిలో దెబ్బతిని చాలా మంది చనిపోయారు. ఆయన పోలీసు స్టేషన్‌కు రమ్మ­న్నారంటే చాలు ఈ ప్రాంతంలో యువకులు హడలి పోతున్నారు. ఆయనకొట్టే కొట్టుడును తటుకోలేక పారిపోతున్నారు. మా అబ్బాయి కూడా చాలా రోజులుగా ఇక్కడ లేడు. గిగ్‌ వర్కర్‌గా జొమా­టోలో పని చేస్తున్నాడు. అలాంటి వాడిని ఇక్కడికి తెచ్చి చంపేశారు.

ఇదంతా పోలీసు ఉన్నతాధికా­రులకు తెలిసే జరిగింది’ అని చెప్పారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ మే 21న సీఐ నాగరాజు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్‌ వీడియోను చూపించారు. దీంతో పాటు సాయికృష్ణను కొడు­తుంటే చూసిన ఓ అబ్బాయి సెల్ఫీ వీడియోను జగన్‌కు చూపించారు.

ఆ వీడియోలో ఏముంది అంటే.. 
నాకళ్లారా చూశా.. లాకప్‌లోనే ఉన్నాడు: ప్రత్యక్ష సాక్షి మహంకాళి చందు
‘నా పేరు మహంకాళి చందు అలియాస్‌ పూరి.. గాదె సాయికృష్ణ అలియాస్‌ పిల్ల సాయి అనే వ్యక్తిని కృష్ణలంక పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్‌లో ఉన్నా. ఆ రోజు ఏం చేశారో నాకు తెలుసు. ఒక తల్లికి జరిగిన నష్టం.. మరో తల్లికి కలిగిన కష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఆరోజు ఏం జరిగిందో చెబుతున్నా.. ఈ వీడియో తీస్తున్నందుకు నాకు భయం వేస్తోంది. కానీ ధైర్యం చేసి చెబుతున్నా.. నేను లాకప్‌లో ఉండగా అతన్ని తెచ్చి చిత్రహింసలు పెట్టారు. అది నేను చూశాను. దాని గురించి బయటకు వచ్చి చెబుదామనుకున్నా చాలాసార్లు.. నాకు జరిగింది జువైనల్‌ కోర్టు దగ్గరకు వెళ్లి లాయర్లకు చెబితే పోలీసులకే సపోర్టు చేశారు.

అందుకే ఎవరికీ చెప్పలేదు. అన్యాయంగా చంపేసి నీ కొడుకును చంపేశామని చెప్పడం న్యాయం కాదు. పైగా సాయి గురించి జనాలకు చెడ్డగా చెబుతున్నారు.. అతను అమ్మాయిలను ఏడిపించాడని ప్రచారం చేస్తున్నారు. మరి ఏ అమ్మాయి అయినా ఫిర్యాదు చేసిందా? పోలీసుల థర్డ్‌ డిగ్రీ ఎలా ఉంటుందంటే.. శరీరంపై కొన్ని చోట్ల కరెంట్‌ షాక్‌ ఇస్తారు. దాని గురించి కోర్టులో చెప్పకూడదని బెదిరిస్తారు. ఏది ఏమైనా చంపే హక్కు వారికి లేదు. తప్పు చేసిన వాడిని జైల్లో పెట్టాలి. అంతే. ఏ శిక్ష వేయాలో కోర్టు నిర్ణయిస్తుంది. బాబురావు, నాని ఆ రోజు సాయిని పట్టుకుని కొడుతున్నారు.

సీలింగ్‌ తెగిపోయిందని చెబుతున్నా సీఐ వినలేదు. ఆ తర్వాత ఆ రోజు నన్ను, మిగతా వాళ్లను స్టేషన్‌ నుంచి బయటకు పంపారు. సీఐ నాగరాజు చాలా చేశారు. బయటకు రాలేదు. ఒక తల్లిగా ఆమె ఎంత బాధ పడుతుందో అందరూ చూస్తు­­న్నాం. బాబురావు మనుషులను ఎంత దారుణంగా కొడతాడో చాలా మంది దగ్గర వీడి­యోలు ఉన్నాయి. నాకు ఒక అవకాశం ఇస్తే మీడియా ముందుకు వస్తా.. చాలా మంది నిన్ను చంపుతారు.. వీడియో చేయొద్దు అని నాకు చెబు­తున్నారు.. ఏం జరిగినా నష్టం లేదు. నా తల్లికి కూడా ఇదే జరుగుద్ది.

ఏపీలో న్యాయం బతకాలి’ అని మహంకాళి ఆ వీడియోలో చెప్పాడు. కాగా, సాయికృష్ణ కుటుంబ పరామర్శలో జగన్‌ వెంట వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవి­నాష్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎమ్మె­ల్సీలు తల­శిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మె­ల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌­కుమార్, సింహాద్రి రమేష్, పార్టీ నేతలు వంగవీటి నరేంద్ర, రామిరెడ్డి, కొండారెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, ఆళ్ల చెల్లారావు, పుప్పా­లకుమారి, అవుతు శైలజారెడ్డి తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement