ఆర్జీయూకేటీ సెట్‌ ఫలితాలు విడుదల

RGUKT CET 2020 Results Released - Sakshi

జనవరి 4 నుంచి కౌన్సెలింగ్‌

అదే నెల రెండో వారం నుంచి తరగతులు

కొత్తగా 300 జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు

సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. అదే నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఆర్జీయూకేటీ సెట్‌–2020 ఫలితాలను శనివారం విజయవాడలో ఆయన విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం సెట్‌ను నిర్వహించామన్నారు. కరోనా కారణంగా 6.30 లక్షల మందికిపైగా విద్యార్థులను పదో తరగతిలో పాస్‌ చేసినట్లు చెప్పారు. ఆర్జీయూకేటీ సెట్‌కు 88,974 మంది దరఖాస్తు చేయగా 85,755 మంది హాజరయ్యారన్నారు. ఈ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వివరించారు. వారంలోనే ఫలితాలను విడుదల చేయడంలో ఆర్జీయూకేటీ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.సి.రెడ్డి, ఇన్‌చార్జ్‌ వీసీ హేమచంద్రారెడ్డి, కన్వీనర్‌ హరినారాయణల కృషి అభినందనీయమన్నారు. ఫలితాలను ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు. విద్యార్థులకు కటాఫ్‌ మార్కులతో కూడిన కాల్‌ లెటర్లు పంపిస్తామన్నారు.

1,900 అభ్యంతరాలు
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశ్నలపై 1,900 అభ్యంతరాలు రాగా ఫిజిక్స్, మ్యాథ్‌్సలో రెండు తప్పులను పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి సురేశ్‌ చెప్పారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ–గుంటూరు, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ– తిరుపతి, డా.వైఎస్సార్‌ హార్టికల్చర్‌ వర్సిటీల పరిధిలో డిపొ్లమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 300 జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామన్నారు. ట్రిపుల్‌ ఐటీల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతోపాటు ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని వాటి డైరెక్టర్లకు సూచించారు. ఈ మేరకు విజయవాడలోని ఒక హోటల్‌లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ట్రిపుల్‌ ఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో కె.సి.రెడ్డి, హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా..
నేను గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఉన్న ఏపీ మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివా. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఉపాధ్యాయుల సహకారంతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాను. ఆర్జీయూకేటీ సెట్‌లో నాకు 99 మార్కులు వచ్చాయి. ఉన్నత విద్యాభ్యాసం అయ్యాక సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేస్తా. 
– గుర్రం వంశీకృష్ణ, స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకర్, ఆర్జీయూకేటీ సెట్, గుంటూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top