భూ సమగ్ర రీ–సర్వేకు.. ప్రతి గ్రామానికీ ఒక బృందం

Revenue Department plan for comprehensive re-survey of lands - Sakshi

ఒక్కో బృందంలో ఇద్దరు సర్వేయర్లు, వీఆర్‌ఏ.. రాష్ట్ర వ్యాప్తంగా 4,500 బృందాల ఏర్పాటు

మొదటి దశలో 5వేల గ్రామాలతో శ్రీకారం

భూముల సమగ్ర రీ–సర్వేకి రెవెన్యూ శాఖ ప్రణాళిక

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీ–సర్వేకి రెవెన్యూ శాఖ పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభించి మూడు దశల్లో అనగా 2023 ఆగస్ట్‌ నాటికి రీ–సర్వే పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి?  సుమారు 120 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి చేపట్టదలచిన ఈ భారీ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే అంశాలతో రెవెన్యూ శాఖ నివేదిక తయారు చేసింది. 

► ప్రతి గ్రామానికీ ఇద్దరు గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్‌ఏ)తో సర్వే బృందాన్ని తయారు చేయనుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4,500 బృందాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
► రికార్డుల స్వచ్ఛీకరించనిదే రీ–సర్వే సాధ్యం కాదు. అందువల్ల భూ రికార్డుల పరిశీలనకు ప్రతి గ్రామానికి ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌ఓ)తో బృందాన్ని ఏర్పాటు చేయనుంది. 
► వీఆర్‌ఓల బృందం పరిశీలించి ఆమోదించిన ల్యాండ్‌ రిజిస్టర్‌ను తహసీల్దార్‌ పరిశీలించి ఆమోదించే వ్యవస్థ ఉంటుంది.
► రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 90 లక్షల మంది పట్టాదారులు (భూ యజమానులు) ఉన్నారు.
► 1.96 కోట్ల సర్వే నెంబర్ల పరిధిలో పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూమిని రీ–సర్వే చేయాల్సి ఉంది.
► మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని మండలాలకు చెందిన 5 వేల గ్రామాల్లోనూ, రెండో దశలో 6,500, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూముల సమగ్ర రీ–సర్వే ప్రక్రియ పూర్తి చేసేలా రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top